ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించారంటూ వైసీపీ నేతలు గేలిచేస్తున్నారు. అంతేకాకుండా.. కొందరు టీడీపీ నేతలు.. చంద్రబాబు మాట లెక్కచేయకుండా ఎన్నికల బరిలో  నిలుస్తున్నారు. దీంతో.. వారందరికీ చంద్రబాబు మీద గౌరవం లేదంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో... ఈ ఆరోపణలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు.

ఓటమి భయంతో టీడీపీ ఎన్నికలను బహిష్కరించిందన్నది తప్పుడు ప్రచారమని, ఎందుకు బహిష్కరించామో స్పష్టంగా చెప్పామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను దేశ ప్రజలకు చెప్పటానికే ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలమేంటో నిరూపించుకున్నామని, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని రామ్మోహన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్దంగా జరగని ఎన్నికలు దేనికి? అంటూ ప్రశ్నించారు. ఒత్తిళ్లు తెచ్చి టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది పోటీలో ఉన్నారని, చంద్రబాబు చెప్పినా పోటీలో ఉన్నారంటే దానిలోనూ న్యాయం ఉందన్నారు.