టీడీపీ ఎంపీ మురళీ మోహన్.. వైసీపీ నేత, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.  ఏపీలో తినడానికి హోటళ్లు లేక.. ఢిల్లీ వెళ్లి భోజనం చేశారా అని విమర్శించారు.

బుగ్గన.. ఢిల్లీ వెళ్లి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ  రామ్ మాధవ్ ని కలిసి పీఏసీ రిపోర్టు అందజేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై మంత్రి లోకేష్ ప్రశ్నించగా.. తాను ఎవరినీ కలవలేదని.. కేవలం బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో లంచ్ చెసినట్లు చెప్పారు.

కాగా.. దీనిపై మురళీ మోహన్ మండిపడ్డారు. లంచ్ చేయడానికి ఏపీలో హోటళ్లే కరువయ్యాయా..? ఢిల్లీ వెళ్లి లంచ్ చేసి రావాలా అని ప్రశ్నించారు. ఎవరి చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

వైసీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును ఒంటరిని చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.  వారి ఆటలు సాగవని...ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారన్నారు. పోరాటం అంటే ఏంటో , అసలు ఆట అంటే ఎంటో రేపటి నుంచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు.