రాజకీయాల కోసమే...లాక్ డౌన్ పై జగన్ ది తప్పుడు అభిప్రాయం: రామ్మోహన్ నాయుడు

ఆంధ్ర ప్రదేశ్ లో ఓ వైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ లాక్ డౌన్ ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలని సీఎం జగన్ పీఎంను కోరడాన్ని టిడిపి ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడు తప్పుబట్టారు.  

TDP MP Kinjarapu Rammohan Naidu Reacts CM YS Jagan opinion on Lockdown

గుంటూరు: కోవిడ్ తీవ్రత నేపథ్యంలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారని... అయినప్పటికీ కేసులు పెరుగుతున్నాయని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా నియంత్రణకు జగన్ ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని...ఇప్పటికైనా సీరియస్ స్టెప్స్ తీసుకోవాలని రామ్మోహన్ సూచించారు. 

''వైరస్ నైజం వల్ల కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 5 లక్షల పాజిటివ్ కేసులు దాటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధాని మోడీ సీఎంలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని రంగాల ప్రముఖలతో కూడా మోడీ గతంలో మాట్లాడటం జరిగింది. అయితే ఇవాళ మోడీతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా వున్నాయి'' అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 

''లాక్ డౌన్ ఎత్తివేసి కొన్ని జోన్లకే పరిమితం చేయాలని జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. 4,5 నెలల పాటు లాక్ డౌన్ లో ఉంటేనే కరోనాను అరికట్టగలమని పలు దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరాయి. ఒడిశాలో 50 కేసులు మాత్రమే ఉన్నప్పటికీ లాక్ డౌన్ ను కొనసాగించాలని అక్కడి ముఖ్యమంత్రి మొట్టమొదటగా నిర్ణయించారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో 400కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. 6గురు మరణించారు. ఇలాంటి తరుణంలో జగన్ అవగాహనారాహిత్యంతో కొన్ని జోన్ లకే లాక్ డౌన్ పరిమితం చేయాలని కోరారు'' అంటూ  సీఎం అభిప్రాయాన్ని తప్పుబట్టారు.

''కరోనాను జగన్ మొదటి నుంచీ సీరియస్ గా తీసుకోవడం లేదు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను జగన్ ఇవాల్టి వరకు తీసుకోలేదు. రాజకీయంగా మలుచుకోవాలనే చూస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రహస్య జీవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తప్పించారు. రమేష్ కుమార్ నెల రోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా తీవ్రత నేపథ్యంలో బాధ్యత గల అధికారిగా వాయిదా వేశారు. ముందుజాగ్రత్త వహించారు. జగన్ కు ఇది నచ్చక నియంతృత్వ ధోరణితో ఆయనపై పలు విమర్శలు చేశారు. జగన్ తన కక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఒక ఐఏఎస్ అధికారి ఎన్నికలను వాయిదా వేశారు. కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ పరిస్థితుల్లో జగన్ తన రాజకీయ కక్ష కోసం ఆయనను తొలగించారు'' అని ఆరోపించారు. 

''హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో సీఎంగా ఉన్న వ్యక్తి రాజకీయాలు చేయవచ్చా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండరు. మరోవైపు తమకు రక్షణ పరికరాలు అందించాలని కోరిన డాక్టర్ ను సస్పెండ్ చేశారు. కమిషనర్ ను తప్పించారు. ఇవే జగన్ ఎంత నియంతగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. కరోనాను కంట్రోల్ చేయడానికి జగన్ అసలు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా లేక రాజకీయాలే చేద్దామనుకున్నారా. ఒక ప్రెస్ మీట్ కూడా సరైనది పెట్టుకోలేని స్థితిలో జగన్ ఉన్నారు'' అని మండిపడ్డారు. 

''మహారాష్ట్ర సీఎం ప్రతిరోజు అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నారు. వైసీపీ మంత్రులు కూడా  కరోనాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తే.. జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటి... ప్రజలకు ఏం భరోసా ఇస్తారో చెప్పాలి. ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. వలస కార్మికులను ఏవిధంగా ఆదుకుంటారు. ఇదంతా జగన్ వైఫల్యమే. మేం రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. పరిస్థితి చేయిదాటితే దేశం నష్టపోతుందని జగన్ గ్రహించాలి'' అని సూచించారు.

'' రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే ఏర్పాట్లు చేశారో సింగిల్ విండో కింద పోర్టల్ రిలీజ్ చేయాలి. డిజిటల్ గవర్నెన్స్ కు ఎందుకు వినియోగించుకోవడం లేదు? చంద్రబాబు హయాంలో సమర్థంగా రియల్ టైం గవర్నెన్స్ ను వినియోగించారు. పేదలు, కూలీలకు రూ.5వేలు సాయం అందజేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. రూ.వెయ్యి సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని రామ్మోహన్  నాయుడు విమర్శించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios