బెజవాడలో కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్నగా ఉన్న వ్యవహారం కాస్తా ఇప్పుడు కేశినేని vs పీవీపీగా మారింది. టీడీపీ నేతల ట్వీట్ల యుద్ధంపై స్పందించిన పొట్లూరి వరప్రసాద్.. కేశినేనిపై సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడంతో.. నాని... పీవీపీని టార్గెట్ చేశారు. అయితే మరోసారి కేశినేని.. బుద్ధా వెంకన్న లక్ష్యంగా స్పందించారు.

తన ట్రావెల్స్ వ్యాపారంపై బుద్ధా గతంలో చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ యుద్ధం మళ్లీ మొదలుపెట్టారు. ఆ ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యమని.. నెంబర ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్ధితి, ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని. దొంగకి వూరందరూ దొంగల్లానే కనబడతారంటూ నాని ఘాటుగా ట్వీట్ చేశారు.

అధిష్టానం హెచ్చరికతో బుద్ధా వెంకన్న వెనక్కి తగ్గినప్పటికీ.. కేశినేని నాని మాత్రం దూకుడుగానే వెళుతున్నారు. ఇటు టీడీపీ అధిష్టానం సైతం ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ ట్వీట్టర్ వార్‌కు ఏ విధంగా తెర పడుతుందోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.