ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరచుకుపడ్డారు టీడీపీ నేత, ఎంపీ కేశినేని నాని.  కనకదుర్గ ఫ్లైఓవర్‌ను వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు.

ఈ వంతెన దేశంలోనే ఒక అద్భుతమైన  కట్టడమని నాని అభివర్ణించారు. టీడీపీ హయాంలో నితిన్ గడ్కరీ సహకారంతో ప్రాజెక్ట్‌ను కీలక దశకు తీసుకువచ్చామని, విజయవాడ అందాన్ని మరింత పెంచేలా ఫ్లై ఓవర్ ఉందని నాని చెప్పారు.

టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగమని, విభజన తరువాత రాష్ట్రాభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని ఎంపీ గుర్తుచేశారు. కియా మోటార్స్‌, హీరో మోటార్స్‌, విశాఖ ఫైనాన్షియల్‌ హబ్‌గా అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు.

ఇప్పటి ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి రాలేదని.. టీడీపీ తీసుకొచ్చిన ప్రాజెక్ట్‌లకు  ఇప్పటి ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది తప్ప.. తట్ట ఇసుక, బస్తా సిమెంట్‌తో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని నాని సెటైర్లు వేశారు.  

తన అభ్యర్థన మేరకు గడ్కరీ రూ.6వేల కోట్ల పనులు మంజూరు చేశారని, విజయవాడ ప్రజలు గడ్కరీకి రుణపడి ఉంటారని కేశినేని పేర్కొన్నారు. బస్టాండ్‌ కన్నా హీనంగా ఉన్న విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎంపీ తెలిపారు.

రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందన్న సంగతి మరోసారి రుజువైందన్నారు. ‘రూ.2,600 కోట్లతో బైపాస్‌రోడ్డు కొత్తగా వచ్చింది, 189 కి.మీ ఔటర్‌ రింగ్‌రోడ్డును జగన్‌ అడుగుతారని భావించా .. కానీ అడగలేదని విమర్శించారు.

దీనిని బట్టి విజయవాడ, అమరావతి పట్ల ముఖ్యమంత్రికి వున్న ద్వేషం మరోసారి బయటపడిందని కేశినేని ఆరోపించారు. ఈస్ట్రన్‌ బైపాస్‌ మాత్రం రూ. 200 కోట్లతో అడిగారు. జగన్‌ కు విజయవాడ, అమరావతి అంటే ఇష్టం లేదు’’ అని కేశినేని నాని ఆరోపించారు.

కనకదుర్గ ఫ్లైఓవర్‌ సాధ్యం కాదని అప్పటి ప్రతిపక్షాలు విమర్శించాయని, కానీ అసాధ్యాన్నిటీడీపీ సుసాధ్యం చేసిందన్నారు. ఈ సందర్భంగా నాడు కేంద్రమంత్రిగా ఉన్న ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేశినేని కృతజ్ఞతలు తెలిపారు.