ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్‌కు లేఖ రాశారు టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. పేరు మార్పుకు వైసీపీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్‌కు లేఖ రాశారు టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర. ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి, ఆయనను అవమానించేందుకే యూనివర్శిటీకి పేరు మార్పు చేశారని ఆయన మండిపడ్డారు. పేదలకు మెరగైన వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే ప్రప్రథమంగా 1986లో అన్ని మెడికల్ కాలేజీలను ఎన్టీఆర్.. ఈ యూనివర్శిటీ కిందకు తీసుకొచ్చారని రవీంద్ర కుమార్ గుర్తుచేశారు. నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వైద్యరంగంలో అనేక మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా వైద్య విద్యార్ధులకు, పేదవర్గాలకు ఎంతగానే ఉపయోగపడిందని ఆయన తెలిపారు.
ఒక దశాబ్దకాలం తర్వాత ఈ సంస్థ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరొంది దేశ విదేశాలలో వేలాది మంది వైద్యవిద్యార్ధులు అనేక కీలక పదవులలో స్థిరపడ్డారని కనకమేడల వెల్లడించారు. గత మూడున్నర సంవత్సరాలు ఈ పేరు మరింత ఇనుమడించిందని.. ఇంతలోనే ఎన్టీఆర్ హల్త్ యూనివర్శిటీ పేరును డా.వై.ఎస్.ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్పు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోందని రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పేరు మార్పుకు వైసీపీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
ALso REad:ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటి పేరు మార్పు.. అసలు కథేంటంటే...
పేరు మార్పుపై పూర్వ విద్యార్ధులకు గానీ, ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ గానీ చేయలేదని ఎంపీ దుయ్యబట్టారు. పేరు మార్పుతో గత నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే కాకుండా దేశ విదేశాలలో వైద్య విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఒక విద్యాసంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను బట్టి ఆ విద్యార్ధుల భవిష్యత్తు ఎంతగా ఆధారపడి ఉంటుందో మాకంటే మీకు బాగా తెలుసునని రవీంద్ర కుమార్ లేఖలో పేర్కొన్నారు.
దేశ విదేశాలలో ఎన్టీఆర్ అన్న పేరుకు ఎంతో ఉన్నతమైన పేరు, వ్యక్తిత్వం ఉన్నాయని కనకమేడల వెల్లడించారు. ఎన్టీఆర్ అన్న పేరు ప్రతీ తెలుగువాడి, ప్రతీ భారతీయుడి హృదయాలను టచ్ చేసే పేరన్నారు. ఇంతటి గొప్ప మహోన్నతమైన పేరు మార్పు చేయడాన్ని ఊహించుకోలేకున్నామని రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కావున, దీనిపై తమరు జోక్యం చేసుకుని పేరు మార్పును నిలుపుదల చేసి సంస్థ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని ఆయన నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్‌ను కోరారు.
