Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటి పేరు మార్పు.. అసలు కథేంటంటే...

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు కేంద్రంగా మారింది. 

Controversy on Name change of NTR Health University in andhra pradesh
Author
First Published Sep 21, 2022, 10:35 AM IST

అమరావతి : జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని వైసిపి సర్కారు నిర్ణయించింది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ గా మార్చాలని తీర్మానించింది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు చేసింది. మంగళవారం రాత్రి హడావుడిగా ఆన్లైన్లో మంత్రులకు ఈ సవరణలను పంపి, కేబినెట్ అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం శాసనసభలో ఈ సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిని ఆమోదించగానే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్త డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుతుంది..

హెల్త్ వర్సిటీ పేరు కథ..
వైద్య విద్యార్థులకు అప్పట్లో ఏపీలో ప్రత్యేక వర్సిటీ లేదు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ,  నాగార్జున యూనివర్సిటీలే వైద్య విద్యార్థులకు గుర్తింపు ఇచ్చేవి. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు జరిగేవి. తగిన పర్యవేక్షణ ఉండేది కాదు. ఆయా వర్సిటీల పేరుతో నకిలీ ఎంబిబిఎస్ సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో వైద్య విద్యలో నాణ్యత పెంచి, పర్యవేక్షణ, నియంత్రణ సాధించేందుకు ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థ ఉండాలని ఎన్టీఆర్ భావించారు. ప్రత్యేకంగా హెల్త్ వర్సిటీని ఎన్టీఆర్ ప్రారంభించారు. అప్పట్లో అన్ని సంస్థలు హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పడి పనిచేసేవి. 

వివాహేతర సంబంధంతోనే ఇంజక్షన్ గుచ్చి మర్డర్.. ముగ్గురు నిందితుల గుర్తింపు, ఇద్దరు అరెస్ట్..

కానీ, తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికి విజయవాడలో హెల్త్ వర్సిటీ ఏర్పాటు చేయాలని 1983లో నిర్ణయించుకున్నారు.  ఆ తర్వాత మూడేళ్లకు 1986 ఏప్రిల్లో వర్సిటీ నిర్మాణం ప్రారంభించారు. అదే ఏడాది నవంబరు 1 నుంచి అడ్మిషన్లు స్వీకరించడం మొదలయ్యింది. అప్పట్లో దీనికి  పెట్టిన పేరు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. 1998 ఫిబ్రవరిలో,  అంటే ఎన్టీఆర్ చనిపోయిన రెండేళ్లకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు.

ఎన్టీఆర్ చొరవతో ఏర్పడిన విశ్వవిద్యాలయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీనికోసం 1998లో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా ఉన్న పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చుతూ  వర్సిటీ సవరించారు.  ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రస్తుతం అంతా పిలుచుకుంటున్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా టిడిపి ప్రభుత్వం పేరు మార్చింది.

అందరూ గౌరవించినా..
వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు జోలికి వెళ్లలేదు.  వైద్య విద్యార్థులకు న్యాయమైన విద్య అందించడంపైనే దృష్టిసారించాయి. చివరికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన హయాంలో ఎప్పుడూ వర్సిటీ కార్యకలాపాల్లో వేలు పెట్టలేదు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సీఎంలుగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా వర్సిటీ పేరు మార్చాలని అనుకోలేదు.  పార్టీలకు అతీతంగా పాత తరం ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అప్పట్లో ఎన్టీఆర్ కు అంత గౌరవం ఇచ్చారు.

వైయస్ మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాలోని హార్టికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఈ పేరునే కొనసాగించింది. తాను పాలించిన  ఐదేళ్ల కాలంలో ఎన్నడూ వైఎస్ పేరును తొలగించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. ఇప్పుడు మాత్రం జగన్ సర్కార్ ఎన్టీఆర్ పేరును తీసేస్తుండడం గమనార్హం. అనేక పథకాలకు పేరు మార్చినట్లే వర్సిటీ పేరును మార్చేస్తున్నారు.

జిల్లాకు పేరు పెట్టి..
జిల్లాల పునర్విభజన సమయంలో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసింది. ఎన్టీఆర్ ను టిడిపి, చంద్రబాబు అలక్ష్యం చేశారని చెప్పింది. ఆయన అంటే మాకు ఎంతో గౌరవం ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఒక చిన్న జిల్లాకు ఆయన పేరు పెట్టి ఇప్పుడు ప్రతిష్ఠాత్మక హెల్త్ యూనివర్సిటీ నుంచి ఆయన పేరును దూరం చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios