న్యూఢిల్లీ: న్యాయస్థానాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ కనకమేడల రవీంద్ర స్పందించారు. న్యాయస్థానాలపై విజయసాయి రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.

మీడియా గొంతు నొక్కుతున్నారని వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ అంశాలు మీడియాలో రాకూడదని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. 

కోర్టులు ఎవరికీ అనుకూలంగా వ్యవహరించబోవని, కోర్టులపై బురద చల్లే ఏకైకా లక్ష్యంతో వైసీపీ పనిచేస్తోందని ఆయన అన్నారు. రాజధాని ప్రకటన తర్వాత ఆస్తులు కొనుగోలు చేసినవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నంలో భూదందాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

Also Read: అలా చేస్తున్నారు: కోర్టులపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజకీయ పబ్బం కోసం సంస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. పార్లమెంటులో ఓ అంశంపై చర్చ జరుగుతుంటే న్యాయస్థానాలపై మాట్లాడుతారా ్ని ఆయన విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై విజయసాయి రెడ్డి విరుచుకుపడడం సరి కాదని వైసీపీవాళ్లు సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని ఆయన అన్నారు.