Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్‌లో చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావన : మోడీ జోక్యం చేసుకోవాలన్న గల్లా .. టీడీపీ-వైసీపీ ఎంపీల మధ్య వార్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. 

tdp mp galla jayadev raised chandrababu arrest issue in parliament ksp
Author
First Published Sep 18, 2023, 5:48 PM IST

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అన్ని ఆధారాలతోనే తాము అరెస్ట్ చేశామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఐటీ శాఖ చంద్రబాబుకు పీఏకు నోటీసులు ఇచ్చిందని.. ఆయన పరారీలో వున్నారని మిథున్ వ్యాఖ్యానించారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిందన్నారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు స్టేలతో తప్పించుకున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. 

అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వారు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో చంద్రబాబు కొడుకు, టీడీపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సేవ్ ఆంధ్రప్రదేశ్- సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులు కూడా ప్రదర్శించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. 

Also Read: ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ నేతలతో కలిసి నారా లోకేష్ నిరసన..

ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలు చూపించారని.. ఈ కేసులో ఆధారాలు లేవని.. అయినప్పటికీ చంద్రబాబును అరెస్ట్ చేశారని  చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు గొంతు ఎత్తే ప్రయత్నం చేస్తే వారిని కటకటాల వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios