ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ నేతలతో కలిసి నారా లోకేష్ నిరసన..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వారు ఆందోళన చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వారు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో చంద్రబాబు కొడుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సేవ్ ఆంధ్రప్రదేశ్- సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులు కూడా ప్రదర్శించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలు చూపించారని.. ఈ కేసులో ఆధారాలు లేవని.. అయినప్పటికీ చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు గొంతు ఎత్తే ప్రయత్నం చేస్తే వారిని కటకటాల వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా.. విజయవాడలోని ఏసీబీ కోర్టు సెప్టెంబరు 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు నిరసనలు చేపడుతున్నారు. ఏపీలోనే కాకుండా.. హైదరాబాద్, బెంగళూరుతో పాటు విదేశాల్లో సైతం పలువురు చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.