టిడిపి వర్క్ షాపులో ఎంపి అవంతి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీని ఉతికి ఆరేశారు. మూడున్నరేళ్ళల్లో ఎక్కడా నోరిప్పని అనకాపల్లి ఎంపి ఆదివారం జరిగిన వర్క్ షాపులో కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఎంపి ఏ స్ధాయిలో మాట్లాడారంటే, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు నేతలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.  అవంతి మాటలకు నేతలు చప్పట్లు కొట్టిన విధానం చూస్తుంటే కేంద్రప్రభుత్వంపై టిడిపి నేతలు ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమవుతోంది.

ఇంతకీ ఏమి జరిగిందంటే, ఆదివారం టిడిపి వర్క్ షాపు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా విశాఖపట్నం జిల్లా అనాకపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, గడచిన మూడున్నరేళ్ళల్లో కేంద్రప్రభుత్వం చంద్రబాబును చిన్న చూపు చూస్తున్న విధానంపై మండిపడ్డారు. చంద్రబాబు తన స్ధాయిని తగ్గించుకుని కేంద్రప్రభుత్వానికి ఒదిగి ఉంటున్నా లెక్క చేయటం లేదని  ధ్వజమెత్తారు.

అమరావతి, పోలవరం, విశాఖపట్నం రైల్వేజోన్ తో పాటు విభజన హామీలను తుంగలో తొక్కటంపై కేంద్రాన్ని దుమ్ము దులిపేసారు. భాజపా పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని తేల్చేశారు. ‘ప్రత్యేకహోదా అడిగితే కేంద్రం ప్రత్యేక ప్యాకేజి ఇస్తా’మని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘పోనీలే అని మనం ప్యాకేజికే సర్దుకుంటే దానికి కూడా ఇప్పటి వరకూ దిక్కులేద’న్నారు.  

అదే సమయంలో చంద్రబాబును ఉద్దేశించి ‘మీకున్నంత సహనం ప్రజలకు లేదు..వారన్నింటినీ గమనిస్తున్నారు..అవసరమైనపుడు తీర్పు చెప్పటానికి సిద్దంగా ఉన్నారు’ అంటూ హెచ్చరించారు. ‘తెలంగాణా ప్రజల్లాగ ప్రతీదానికి రోడ్లెక్కరు..సమయం వచ్చినపుడు సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తారు’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఎంపి మాట్లాడిన విధానానికి నేతలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టటం ద్వారా తమ మద్దతును తెలిపారు. అయితే, ఇక్కడే ఎంపి ఓ విషయం మరచిపోయారు. జనాల్లో కోపం నిజమే అయితే, అది ఒక్క భాజపా మీద మాత్రమే కాదు టిడిపి మీద కూడా చూపుతారు.

ఎంపి మాటలను విన్న చంద్రబాబు కాస్త ఇబ్బందిపడ్డారు. అయితే, చివరలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘రాష్ట్రాభివృద్ధికి తాను అన్నీ ప్రయత్నాలు చేస్తున్న’ట్లు చెప్పారు. చివరి వరకూ ప్రయత్నిస్తూనే ఉంటానని, ఆవేశపడితే ఉపయోగం లేదన్నారు. ‘చివరి వరకూ చూద్దాం ఏమవుతుందో..కాకపోతే అప్పుడు దండం పెట్టేద్దాం’ అంటూ సర్దుబాటు చేస్తున్నట్లుగా చెప్పారు. మొత్తం మీద వర్క్ షాపు జరిగిన విధానం చూస్తుంటే  కేంద్రం వైఖరిపై టిడిపి ఎంతలా మండిపోతోందో  అర్ధమైపోతోంది.