తెలుగుసీని పరిశ్రమపై తెలుగుదేశంపార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై మండిపడ్డారు. మీడియాతో మంగళవారం మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుంటే టాలీవుడ్‌కు పట్టదా అంటూ నిలదీశారు. అలాగే హీరోలు, కళాకారులకు పోరాడే చేవ చచ్చిపోయిందా అంటూ ధ్వజమెత్తారు.

జల్లికట్టు ఉద్యమాన్ని తమిళ సినీ పరిశ్రమే నడిపించిందని తమిళ నటీనటుల్ని చూసైనా తెలుగు పరిశ్రమ పోరాటం చేయాలన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమించకపోతే ఐదు కోట్ల మంది ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని ఆయన హెచ్చరించారు. ఏపీ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతుందని, ఒక్క సినీ పరిశ్రమే ప్రత్యేక హోదాపై గళం వినిపించడం లేదని ఆయన మండిపడ్డారు.