వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలతో పాటు త్వరలోనే విశాఖలో కాపురం పెడతానన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేసారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖపట్నంకు తన మకాం మార్చనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న సెప్టెంబర్ నుండి తన కార్యకలాపాలన్నీ విశాఖ నుండే సాగనున్నాయని... అక్కడే కాపురం పెట్టబోతున్నానంటూ జగన్ సంచలన ప్రకటన చేసారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే పంచుమర్తి స్పందిస్తూ సీఎం జగన్ ను ఎద్దేవా చేసారు.
ముఖ్యమంత్రి జగన్ ను విశాఖపట్నంలో కాపురం పెట్టమని విజయ్ కుమార్ స్వామి చెప్పారా లేక స్వరూపానంద స్వామి చెప్పారా? అని అనురాధ ప్రశ్నించారు. ఆయన ఎక్కడ కాపురం పెడితే అక్కడ అక్రమాలకు పాల్పడతారు... కానీ విశాఖలో కాపురం పెట్టకముందే అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఇక అక్కడే కాపురం పెడితే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అంటూ అనురాధ ఆందోళన వ్యక్తం చేసారు.
రాయలసీమలో కాపురం పెట్టి ఇడుపులపాయలో ప్రభుత్వ భూములు కొట్టేసిన వ్యక్తం జగన్ రెడ్డి అని అనురాధ ఆరోనించారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి ప్రాంతంలో కాపురం పెట్టి ఆ ప్రాంత రైతులను రోడ్డున పడేసాడని అన్నారు.ఇలా జగన్ కాపురం పెట్టిన చోటల్లా అక్రమాలు చేస్తుంటారని ఆరోపించారు.
Read More సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెట్టబోతున్నాను.. సీఎం జగన్ కీలక ప్రకటన
మూడు రాజధానులంటూ ఇంతకాలం ఏపీకి రాజధానే లేకుండా చేసిన జగన్ ఇప్పుడు విశాఖ నుండి పాలిస్తానని అంటున్నాడని అనురాధ పేర్కొన్నారు. కాని పాలన కంటే ముందే విశాఖలో దోపిడీ ప్రారంభమైందని.... ఇప్పటికే రూ.40 వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసారని ఆరోపించారు. అందమైన రుషికొండను బోడిగుండు చేసారని అన్నారు. ఇదేనా పరిపాలన వికేంద్రీకణ అని జగన్ ను నిలదీసారు అనురాధ.
ఇక వివేకా హత్య కేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అనురాధ రియాక్ట్ అయ్యారు. సొంత బాబాయ్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఈ నాలుగేళ్లలో లక్ష అబద్దాలతో కాలం గడిపారని అన్నారు. ఓ కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా అంటూ వివేకా హత్యపై జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను అనురాధ గుర్తుచేసారు. మరి ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్, వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ గురించి ఏమాంటారు అని ప్రశ్నించారు. జగన్ ఆండ్ కో నటన ఆస్కార్ స్థాయిలో వుందని అనురాధ ఎద్దేవా చేసారు.
వివేకా హత్య కేసులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే తాడేపల్లి ప్యాలెస్ పై అనుమానాలు మరింత పెరిగాయని టిడిపి ఎమ్మెల్సీ అన్నారు. కేవలం తన రాజకీయ స్వార్థంతో పిన్నమ్మ తాళి తెంచిన జగన్ రెడ్డి ఏపీ ప్రజలుకు న్యాయం చేస్తాడా? అని నిలదీసారు. ఇంతకాలం జాప్యం జరిగినా వివేకా హత్య కేసులో నిందితులెవరో బయటపడుతోందని... కీలకంగా వ్యవహరించిన మరికొన్ని పేర్లు ఇంకా బయటకు రావాల్సివుందని టిడిపి ఎమ్మెల్సీ అనురాధ పేర్కొన్నారు.
