ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీఎల్పీ ఉపనేత నారా లోకేష్. జగన్‌ రెండు నెలల పాలనంతా కమిటీలు, కమిషన్‌లేనంటూ ఆరోపించారు. 

పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు గాలిలో తిరుగుతూ భూమిపై సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

గోదావరి వరదల వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. బాధితులకు ఎకరాకు రూ.10 వేలు సాయం అందించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. అలాగే మత్స్యకారులను కూడా ఆదుకోవాలని జగన్ ను విజ్ఞప్తి చేశారు. 

ఇకపోతే పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన పంటలను పరిశీలించిన నారా లోకేష్ బాధితులను ఓదార్చారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన మార్టేరు కోడేరు, ఆచంట, ఆచంట వేమవరం, గుమ్ములూరు ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి  తెలుసుకొన్నారు. నారా లోకేష్ తోపాటు టీడీఎల్పీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైతం ఉన్నారు.