అమలాపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి నారా లోకేష్. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దొంగకేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. 

దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన బాలయోగి సేవలను కొనియాడారు. కోనసీమకు రైల్వే లైన్ వేసిన ఘనత బాలయోగికే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో బాలయోగి కృషి వర్ణించలేనిదని చెప్పుకొచ్చారు.  

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దొంగ కేసులు పెడితే సింహంలా తిరగబడతామని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. గ్రామ పంచాయితీలకు వైసీపీ రంగులు వేయడం సిగ్గుచేటన్నారు నారా లోకేష్.