గుంటూరు:  ఆంధ్ర  ప్రదేశ్ శాసనమండలిలో నిన్న(గురువారం) జరిగిన పరిణామక్రమాలు చాలా బాధాకరమని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. గత సమావేశాల సమయంలో మండలిలో మంత్రులు నానా రభస చేసి అభాసుపాలయిన నేపథ్యంలో ఈ సమావేశాలనైనా ప్రశాంత వాతావరణంలో జరుపుతారని భావించామని... కానీ గతంలో కంటే దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. 

''ఓవైపు కరోనా మహమ్మరి విజృంభిస్తున్నా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ హాజరవడం జరిగింది. ప్రజల కోసం దాదాపు 10 బిల్లులను మేము కూడా ఆమోదించి మండలిలో ప్రశాంత వాతావరణంలో ముందుకు వెళుతున్నాం. ఆర్థిక బిల్లును కూడా ప్రవేశపెట్టమని, ఆమోదిస్తామని యనమల రామకృష్ణుడు తెలుపగా గతంలో సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను, కోర్టు పరిధిలో ఉన్న బిల్లులను మరలా మంత్రులు ప్రవేశపెట్టారు. తాము అనుకున్నదే జరగాలనే పంతంతో వ్యవహరించారు. 22 మంది మంత్రులు కౌన్సిల్ కు వచ్చి మండలిలో టెన్షన్ వాతావరణం తీసుకొచ్చారు'' అని అన్నారు. 

read more  ప్యాంట్ జిప్ తీసి చూపించానా... : మంత్రి అనిల్ కౌంటర్

''ఆర్థిక మంత్రి ఆర్థిక బిల్లు ప్రవేశపెడుతుంటే ఆయనను కూర్చొమని బొత్స సత్యనారాయణ సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం..? రెండు గంటలు గడిచినా  ఈ విషయంలో ముందుకు వెళ్లకపోయే సరికి యనమల ఓటింగ్ ను కోరారు. దీపక్ రెడ్డి గారు ఓటింగ్ లో పాల్గొనే సభ్యులను సభలో ఉంచి మిగతా వారిని బయటకు పంపమని మర్యావపూర్వకంగా ఛైర్మన్ ను విన్నవించారు. ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రి కలగజేసుకుని సభ్యసమాజం సిగ్గుపడే పదజాలంతో దూషణలకు దిగారు. లం..కొ... నీ బాబు కూడా బయటకు పంపలేడురా అంటూ మాట్లాడలేని పదాలతో దూషించారు'' అని తెలిపారు. 

''దీంతో నేను కలుగచేసుకుని మంత్రి అయి ఉండి ఇలా మాట్లాడటం తగదని చెప్పగా.. మరలా అదే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత నారా లోకేష్ పై కూడా మూకుమ్మడిగా దాడికి అధికార పక్షం సభ్యులు ప్రయత్నించగా పక్కనే వున్న బీద రవిచంద్ర అడ్డుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు ఉన్న స్థానానికి అధికారపక్ష సభ్యులు వచ్చి తిరిగి మమ్ములను దాడిచేశామని విమర్శించడం ఎంతవరకు సమంజసం'' అని నిలదీశారు. 

''మేం తప్పు  చేశామని విమర్శించే ముందు వీడియో ఫూటేజీని బయట పెడితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఘర్షణ పడుతున్న వారిని విడదీయడమే తప్ప  ఘర్షణకు దిగడం మాకు తెలియదు. మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ అది. దెబ్బలాటలు కుస్తి పోటీలలో బాగుంటాయి కానీ చట్టసభలలో కాదు. గత సమావేశాల సమయంలోనూ ఛైర్మన్ షరీఫ్ గారిని ఇదేవిధంగా నానా దుర్భాషలాడారు. ఇప్పటికైనా అధికారపక్ష సభ్యులు తీరును మార్చుకుని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని కోరుతున్నాను'' అని మంతెన అన్నారు.