గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పర్యాటక, యువజన క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు. అవంతి శ్రీనివాస్ కు పబ్లిసిటీ జబ్బు పట్టుకుందంటూ మండిపడ్డారు. అవంతి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచచరించారు.

వైసీపీ అనే గంజాయి వనంలో తాను తులసి మొక్క అనే అపోహలో అవంతి శ్రీనివాస్‌ మునిగి తేలుతున్నారంటూ ధ్వజమెత్తారు. మోసం, దగా, వంచనకు మారుపేరు అవంతి శ్రీనివాస్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

పాలనను గాలికొదిలేసి గాఢ నిద్రలో ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కంట్లో పడేందుకు అడ్డమైన డ్రామాలాన్నీ ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మంత్రి పదవిని చేపట్టిన 4 నెలల కాలంలో విశాఖ జిల్లాకు కనీసం ఏం చేశారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఉన్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.  

తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పై నోరుపారేసుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి అవంతి శ్రీనివాస్‌కు మైండ్‌ బ్లాక్‌ అయిందని విమర్శించారు. 

మంత్రి పదవి పోతుందనే ఫోబియాతో అవంతి శ్రీనివాస్‌కు నిద్ర కూడా పట్టడం లేదన్నారు. అందుకే కళ్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. అయితే విమర్శలకు దిగే ముందు అవంతికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడేనన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. 

వందమంది అవంతి శ్రీనివాస్‌లు, వెయ్యి మంది జగన్‌లు వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు. 37 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో ప్రజా బలంతో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని చెప్పుకొచ్చారు.  

గోదావరిలో మునిగిన పడవను 30 రోజులైనా బయటికి తీయడం చేతకాని నేతలకు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. స్మశానాలకు, పాఠశాలలకు వైసీపీ రంగులు వేయటంపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని ఎద్దేవా చేశారు. 

వశిష్ట బోటుకు అనుమతిచ్చి 50మందికిపైగా ప్రాణాలను బలిగొన్న అవంతి శ్రీనివాస్‌ వశిష్టాసురుడిగా పేరు పొందారన్నారు. టైటానిక్‌ మునిగి 100 ఏళ్లయినా బయటకి తీయలేదు. చూస్తుంటే వశిష్ట బోటును కూడా మీరు మరో టైటానిక్‌లా చేసేలా ఉన్నారని తిట్టిపోశారు. 

ఆటోల వెనుక జగన్‌ ఫోటో పెట్టుకుంటే పోలీసులు ఆపరని మీ మాటలు విన్న ఆటోడ్రైవర్లంతా నేడు బాడుగలు రాక బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. చేతనైతే వ్యవస్థలను కాపాడి  ప్రజలను ఆదుకోవాలని హితవు పలికారు. అంతేగానీ చిల్లర రాజకీయాలతో ప్రయోజనం పొందుతామనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వమే అవుతుందని హెచ్చరించారు ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు.