గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. ప్రభుత్వ అసమర్థత వల్లే రాజధాని అమరావతి అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధానిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రైతులు స్వచ్చంధంగా 33వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేశారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు ఆపడం, కొత్త కమిటీని నియమించడం ఎందుకని నిలదీశారు. రాజధాని నిర్మాణ పనులు మధ్యలో నిలిపివేయడంపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని ఆరోపించారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. 

ప్రభుత్వం వెంటనే నిలిపివేసిన రాజధాని పనులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాజధాని అమరావతిపై నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం తీరును ఎండగడతామని హెచ్చరించారు మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.