Asianet News TeluguAsianet News Telugu

కష్టాన్ని నమ్ముకున్న స్త్రీని ఆదరిస్తారా? లేక ఆ వేశ్యనా?: టిడిపి ఎమ్మెల్సీ దీపక్ సంచలనం

యుద్ధంలో ధీరులు ముందుకువెళుతూ పోరాడి విజయం సాధిస్తారని, మరికొందరు వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి గెలుస్తారని, వారిలో ఎవరిది నిజమైన విజయమో కూడా ప్రజలు ఆలోచించాలన్నారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 

TDP MLC Deepak Reddy Sensational Comments on YSRCP
Author
Amaravathi Dam, First Published Mar 15, 2021, 2:45 PM IST

అమరావతి: స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం వైసీపీ కోడ్ అమలు చేసిందని, అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు సీఎం జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేశాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. గెలుపుని చూసి పిచ్చిపిచ్చి గా మాట్లాడుతున్న వైసీపీ నేతలంతా రాబోయేతరాలు ఈ ఎన్నికల గురించి, గెలుపు గురించి తప్పకుండా చెప్పుకుంటాయని, గెలిచినవారంతా ప్రజాస్వామ్యస్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. 

సోమవారం దీపక్ రెడ్డి తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతూ... భర్తలను కోల్పోయిన ఇద్దరు మహిళలు, వారిపిల్లల్ని కుటుంబాలను పోషించుకోవడానికి చెరోదారి వెతుక్కున్నారని, వారిలో ఒకామె వేశ్యగా మారితే, మరోకామె కష్టపడి కూలీపని చేస్తుందన్నారు. ఆ ఇద్దరిలో సమాజంలో ఎవరికి గుర్తింపు ఉంటుందో రాష్ట్ర ప్రజలే చెప్పాలన్నారు. అదేవిధంగా యుద్ధంలో ధీరులు ముందుకువెళుతూ పోరాడి విజయం సాధిస్తారని, మరికొందరు వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి గెలుస్తారని, వారిలో ఎవరిది నిజమైన విజయమో కూడా ప్రజలు ఆలోచించాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగాయా లేదా అనేది అప్రస్తుతమన్న దీపక్ రెడ్డి, ఎడిటర్స్ గిల్డ్ అనే సంస్థ రాష్ట్రంలో స్థానికఎన్నికల్లో గెలవడం కోసం అధికార పార్టీ దాదాపు రూ.10వేలకోట్ల వరకు ఖర్చుచేసినట్లు చెప్పిందన్నారు. ఎన్నికల్లో ఖర్చుచేసిన సొమ్మంతా ఎక్కడినుంచి వచ్చిందో ప్రజలే ఆలోచనచేయాలన్నారు.  

ఏకగ్రీవాలయ్యాయని జబ్బలు చరుచుకుంటున్న వైసీపీ నేతలు, రాజ్యాంగాన్ని కాలరాశారనే వాస్తవం విస్మరించడం సిగ్గచేటన్నారు. టీడీపీకి అభ్యర్థులు లేరని చెబుతున్న వైసీపీకి తమ పార్టీ తరుపున పోటీచేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పినా అధికారపార్టీ నుంచి స్పందనలేదన్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలతో పోలిస్తే, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 5శాతం వరకు ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. అధికారపార్టీ దౌర్జన్యాలు, దుర్మార్గాలు చూసి ఓటర్లు బయటకు రాలేదన్నారు. రౌడీబలాన్ని, పోలీసు బలగాలను వాడటంతో పాటు, విచ్చలవిడిగా డబ్బును ఖర్చుచేయబట్టే, అధికారపార్టీకి గెలుపు దక్కిందన్నారు.

స్థానికఎన్నికల్లో గెలుపుకోసం రిగ్గింగులు, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేయడం, పోలింగ్ ఏజెంట్లపై దాడిచేయడం, అధికారులతో కుమ్మక్కవ్వడం, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం వంటి అనేక దాష్టీకాలకు అధికారపార్టీ పాల్పడిందన్నారు. ఇన్ని అరాచకాలు, కుట్రలు చేసి సాధించిన విజయం నిజమైన విజయమో, కాదో ప్రజలే ఆలోచనచేయాలన్నారు. అధికార పార్టీ ఆగడాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేసినా ఎటువంటి స్పందనలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2వేల వరకు ఘటనలు జరిగాయని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనేకదారుణాలు జరిగాయన్నా రు. టీడీపీతోపాటు ఇతర పార్టీలు చేసిన ఫిర్యాదులపై కూడా ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

వైసీపీ వాపుని బలుపు అనుకుంటోందన్నారు. 2012లో జరిగిన రాయదుర్గం ఉపఎన్నికలో వైసీపీ విజయం సాధించిందని,  ఆ తరువాత సంవత్సరంన్నరకే జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిందన్నారు. కేవలం ఏడాదిన్నరకే ఎటువంటి మార్పువచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ గెలిస్తే, 2014లో జరిగిన ప్రధాన ఎన్నికల్లో గతంలో గెలిచిన స్థానాలను కూడా వైసీపీ కోల్పోయిందన్నారు. ఆనాటి ప్రతిపక్షపార్టీ పనితీరు చూసి విసుగుతో 23మంది ఎమ్మెల్యేలు ఆపార్టీని వదిలేశారన్నారు.  ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటుందని భావించిన ప్రజలు, సమస్యలు కొనితెచ్చుకోవడం ఇష్టంలేకనే వైసీపీకి ఓట్లేశారని దీపక్ రెడ్డి తెలిపారు. 

రాష్ట్రంలో వైసీపీని ఎదిరించేది, ఎప్పటికైనా ఓడించేది తెలుగుదేశం పార్టీయేననే వాస్తవం మాత్రం ప్రజలకు అర్థమైందన్నారు.  పురపోరులో 2,123 స్థానాల్లో ఎన్నికలు జరిగితే, బీజేపీ కేవలం 8స్థానాలు మాత్రమే గెలిచి, 0.37శాతానికే పరిమితమైందన్నారు. జనసేన 19స్థానాల్లో గెలిచి, 0.89శాతం ఓటింగ్ షేర్ పొందిందన్నారు. రెండుపార్టీలు కలిపికూడా 1.27శాతానికే పరిమితమయ్యాయన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆ రెండు పార్టీలకంటే పదిరెట్లు ఎక్కువ స్థానాలు వచ్చాయన్నారు. బీజేపీ పరిస్థితి ఎందుకింత దారుణంగా తయారైందనే దానిపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. ఆనాడు రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహంచేస్తే, నేడు బీజేపీ నమ్మకద్రోహ చేసిందనే బాధ ప్రజల్లో ఉందన్నారు. 

Read more  గన్నేరు పప్పు అండ్ గబ్బుకి ఇదే నా సవాల్: అయ్యన్నపాత్రుడు

బీజేపీ వైసీపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయనే భావన కూడా రాష్ట్ర వాసుల్లో ఉందన్నారు. బీజేపీ చర్యలను వైసీపీ సమర్థిస్తోందని, రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలను బీజేపీ ప్రశ్నించకపోవడాన్నిచూసే ప్రజల్లో అటువంటి అభిప్రాయం ఏర్పడిందన్నారు.  వైసీపీ గెలుపుపై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు, ఆపార్టీకి చెందిన పదిమంది సీనియర్ నేతలకు లైడిటెక్టర్ టెస్ట్ చేయిస్తామని, వారంతా గెలుపుకోసం తాము ఎటువంటి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడలేదని నిజం చెప్పగలరా? అని దీపక్ రెడ్డి సవాల్ విసిరారు. పదిమంది నాయకుల్లో ఒక్కరైనాసరే లైడిటెక్టర్ టెస్ట్ లో పాసైతే, వారికి నమస్కరించి వారివిజయాన్ని టీడీపీ పొగుడుతుందన్నారు. గెలుపును సాకుగాచూపి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వైసీపీనేతలంతా తాము విసిరే సవాల్ కు కట్టబడి ఉంటారా? అని దీపక్ రెడ్డి ప్రశ్నించారు. 

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సాధించింది నిజమైన విజయమే అయితే తాడిపత్రిలో ఆపార్టీ ఎమ్మెల్యేతో వైసీపీ నాయకత్వం తక్షణమే రాజీనామా చేయించాలన్నారు. రాజీనామా తరువాత జరిగే ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే, స్థానిక ఎన్నికల్లో వారు సాధించింది నిజమైన విజయమని తాము, తమ పార్టీ ఒప్పుకుంటుందన్నారు. వైసీపీ నేతలు, బ్రిటీషు వారిలా కండకావరంతో మాట్లాడుతున్నారని, అధికారపార్టీ ఎంతలా ప్రలోభాలు, దౌర్జన్యాలు చేసినా, రాష్ట ప్రజలను బానిసలుగా మారనివ్వబోమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, వైసీపీ దౌర్జన్యాలను ఎదిరించి, ఎన్నికల్లో పోరాడటం ద్వారా టీడీపీ కార్యకర్తలు నిజమైన దేశభక్తులుగా నిరూపించుకున్నారన్నారు. 

తాడిపత్రి, మైదుకూరు నియోజకవర్గాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటింగ్ శాతం తగ్గిందో ఆ పార్టీనేతలే చెప్పాలన్నారు.  వైసీపీ బెదిరింపులు, అదిరింపులకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అదరరు, బెదరరనే వాస్తవాన్ని అధికారపార్టీ గ్రహిస్తే మంచిదని దీపక్ రెడ్డి హితవుపలికారు. చంద్రబాబునాయుడు స్ఫూర్తితో ప్రతిఒక్క టీడీపీ నాయకుడు, కార్యకర్త రాష్ట్రాన్ని వైసీపీ నుంచి కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటారన్నారు. వైసీపీ ఆగడాలకు, దుశ్చర్యలకు, దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసేది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీయేనని దీపక్ రెడ్డి తేల్చి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios