అమరావతి: తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాలితో తన్నారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే శాసనమండలిలో వీడియో పుటేజీని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శాసనమండలిలో నిన్న చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన స్పందించారు.  శాసనమండలిలో ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టాం. వారు చెప్పేదొకటి, చేసేదొకటి. దీంతో సహనం కోల్పోయి 18 మంది మంత్రులు శాసనమండలికి వచ్చి మమ్ముల్ని ధూషించారన్నారు. 

గలాటా పెట్టుకోవాలని చూశారు. నోటికి వచ్చినట్లు ఘోరమైన తిట్లు, మాటలు అన్నారు. బిల్లులు పాస్ కావాలనే ఉద్దేశంతో మేం ఉంటే.. ఏదో విధంగా గొడవ పెట్టుకుని బిల్లులు పాస్ కాకుండా చేసి, టీడీపీపై నెపం వేయాలని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. 

ఆర్థికమంత్రి రాగానే అప్రాప్రియేషన్ బిల్లు పాస్ చేయాలని కోరాం. అయితే వారు ముందు సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ముందు అప్రాప్రియేషన్ బిల్లు పెట్టాలని, లేకపోతే సమస్యలు వస్తాయని 20 నుంచి 30 సార్లు మేం విజ్ఞప్తి చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

బడ్జెట్ సెషన్ పేరుతో రాజధాని బిల్లు పాస్ చేసుకోవాలనేదే వారి ఉద్దేశం. సీఆర్డీయే రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపామని ప్రభుత్వమే హైకోర్టులో ఒప్పుకొందన్నారు.

సెలెక్ట్ కమిటీ పేర్లు సెక్రటరీ సిఫార్సు చేయలేదు. బిల్లులు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు తీసుకురాకూడదు. బిల్లులు టీడీపీ ఆపిందని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఒక ప్లాన్ ప్రకారమే 18 మంది మంత్రులు మండలికి వచ్చారు. గతంలో కూడా ఇదేవిధంగా గలాటా చేశారు. కెమెరాలు, లైవ్ టెలికాస్టింగ్ ఆపేశారు. 3,4 సార్లు మాపై దాడులు చేసేందుకు మావైపు దూసుకు వచ్చారని ఆయన చెప్పారు. 

బయటకు వచ్చి మాత్రం టీడీపీ సభ్యులు దాడి చేసినట్లుగా నిసిగ్గుగా చెబుతున్నారు. వైసీపీ సభ్యులు మా వైపు వస్తే.. దాడి మేం చేసినట్లా, వారు చేసినట్లా. ఒక మంత్రి ప్యాంట్ జిప్ ఓపెన్ చేశారు. మహిళా సభ్యులున్నా పట్టించుకోలేదని ఆయన వివరించారు.

గత సెషన్ లో కూడా గ్యాలరీలోకి వైసీపీ ఎమ్మెల్యే వచ్చి జిప్ ఓపెన్ చేశారు. ఏ స్థాయికి వ్యవస్థను వైసీపీ నేతలు దిగజార్చారో ప్రజలు గమనించాలి. ప్రజా సమస్యలు చర్చించకుండా వైసీపీ సభ్యులు దాడులు, ధూషణలకు దిగుతున్నారు. శాసనాలు రాసే వారే వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్నారు. 

72 ఏళ్ల చరిత్రలో ఇలాంటి సంక్షోభం ఎక్కడా రాలేదు. ప్రభుత్వమే క్రిమినల్స్ గా మారి వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆయన విమర్శించారు. సెలెక్ట్ కమిటీ విషయంలో సెక్రటరీని బెదిరించి ఛైర్మన్ మాటలు వినవద్దని చెప్పారు. 

మండలిలో నిన్నటి వీడియో ఫుటేజీలను వైసీపీ నేతలు బహిర్గతం చేయాలని సవాల్ చేస్తున్నా. ఎవరు ఎవరిపై దాడి చేశారో ప్రజలకే అర్థమవుతుందని ఆయన తెలిపారు. 

ప్రజల కోసమే మేం పనిచేస్తున్నాం. వైసీపీ సభ్యులు మమ్ముల్ని నోటికొచ్చినట్లు తిడుతున్నారు. దాడులు చేస్తున్నారు. మేం ఏం చేయాలో ఏపీ ప్రజలు చర్చించుకుని మాకు మెసేజీలు పెట్టాలని ఆయన కోరారు. 

 ఇదేవిధంగా మేం కొట్టించుకుంటూ ఉండాలి. లేదా మేం కూడా తిట్టాలా, కొట్టాలా అని ప్రజలు ఆలోచించి చెప్పాలన్నారు.మూడు గంటలు అప్రాప్రియేషన్ బిల్లు పాస్ చేయాలని మేం కోరితే టీడీపీ అడ్డుకుందని వైసీపీ పచ్చి అబద్ధాలు ఆడుతోందన్నారు. 

నేను ఒక్కడినే పోడియం వద్దకు వెళ్లి సంబంధం లేనివారిని బయటకు పంపాలని కోరినట్టుగా చెప్పారు. వెల్లంపల్లి శ్రీనివాస్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. నన్ను తిట్టి బీద రవిచంద్ర యాదవ్ ను కాలితో తన్నాడని చెప్పారు. 

తన మీద పడితే బీద రవిచంద్ర ఆయనను తోసేశాడు. బీద రవిచంద్రే తనపై దాడి చేశాడని వెల్లంపల్లి అబద్ధాలు చెబుతున్నారు. మూలన ఉన్న లోకేష్ గారు జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ కు మెసేజ్ పెడుతుంటే మంత్రులు వచ్చి ఫోటోలు తీస్తున్నారంటూ లోకేష్ పై దాడికి ప్రయత్నించారని ఆయన వివరించారు.

వైసీపీ ఏడాది పాలనలో అధికారమదంతో చేసిన కేసులు 800, 13 హత్యలు, మహిళలపై అరాచకాలు 368, స్పందనలో మహిళల ఫిర్యాదులు 4987, ప్రశ్నించిన వారిపై 74 కేసులు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు 350, టీడీపీ నాయకులను అక్రమంగా జైలుకు పంపించిందని ఆయన విమర్శించారు.