తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ ను ఎపి హైకోర్టు కొట్టేసింది. తాడిపత్రి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తనకు ఓటు వేసే హక్కు కల్పించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 

తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమకు ఓటేసే హక్కు కల్పించాలని నలుగురు ఎమ్మెల్సీలు పెట్టుకున్న దరఖాస్తులను కమిషనర్ తిరస్కరించారు. ఆ నలుగురిలో ముగ్గురు వైసీపీకి చెందినవారు కాగా, మరొకరు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. కమిషనర్ నిర్ణయాన్ని దీపక్ రెడ్డి కోర్టులో సవాల్ చేశారు. అయితే, కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

తాడిపత్రి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా మారిన స్థితిలో దీపక్ రెడ్డి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చడం టీడీపీకి ఎదురు దెబ్బనే కావచ్చు. తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 మున్సిపల్ వార్డులు ఉండగా, 18 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. మరో 16 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. మిగతా ఇద్దరిలో ఒకరు కమ్యూనిస్టు పార్టీకి చెందిన కౌన్సిలర్ కాగా, మరొకరు స్వతంత్రులు.

వైసీపీకి రెండు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతు ఉంది. దీంతో వైసీపీ ఓటర్ల సంఖ్య 18కి చేరింది. దీంతో స్వతంత్ర కౌన్సిలర్, కమ్యూనిస్టు పార్టీ కౌన్సిలర్ ఓట్లు కీలకంగా మారాయి. వీరిద్దరు కూడా తమకు మద్దతు ఇస్తారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమాతో ఉన్నారు. దీపక్ రెడ్డికి కూడా ఓటు హక్కు కల్పిస్తే తమకు 21 మంది మద్దతు ఉంటుందని భావించారు. కానీ దీపక్ రెడ్డికి ఆ అవకాశం లేకుండా పోయింది.

ఈ నెల 18వ తేదీన మున్సిపల్ చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో తాడిపత్రి మున్సిపాలిటీ చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికలో ఉత్కంఠ చోటు చేసుకుంది.