Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డతో ఒకే కంచం, ఒకే మంచం...గుర్తురాలేదా?: జగన్‌కు టిడిపి ఎమ్మెల్సీ చురకలు

స్థానికసంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా వ్యవస్థలను నాశనం చేయడమేగాకుండా, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేవారిపై నిందలేయడం ముఖ్యమంత్రి జగన్ కే చెల్లిందన్నారు టిడిపి ఎమ్మెల్సీ చెంగల్రాయులు. 

TDP MLC Chegalrayalu satires on  AP CM YS Jagan
Author
Guntur, First Published Mar 16, 2020, 7:28 PM IST

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కులాన్ని ఆపాదించడం... ఎన్నికల కమిషన్ విధులను భూతద్దంలో  చూపుతూ స్వతంత్రబద్దంగా వ్యవహరించే సంస్థను నిలువరించాలని చూడటం సరికాదని టీడీపీనేత, ఎమ్మెల్సీ బీ.చెంగల్రాయలు హితవుపలికారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. 

స్థానిక ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా వ్యవస్థలను నాశనం చేయడమేగాకుండా, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేవారిపై నిందలేయడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంపై కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే అవేమీ తనకు పట్టవన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 

వేగంగా వ్యాప్తిచెందుతున్న  కరోనా ప్రభావాన్ని గుర్తించి దాని తీవ్రత ఉధృతమవకుండా నిరోధించడంకోసం, ప్రజల ప్రాణాలకు హాని లేకుండా చేయడంకోసం ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలు వాయిదావేస్తే ఆయన్ని దోషిగా చిత్రీకరించడం జగన్ వంటి అవకాశవాదికే  చెల్లిందన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అవసరమైనప్పుడల్లా కులాల ప్రస్తావన తీసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ ది ఏకులమో, ఆయనద్వారా తన సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా పెట్టించాడో సమాధానం చెప్పాలన్నారు. 

నిమ్మగడ్డతో కలిసి ఒకే కంచాన్ని, ఒకేమంచాన్ని పంచుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆనాడు గుర్తురాని కులం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని చెంగల్రాయలు నిలదీశారు. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంస్థల్లో రూ.700కోట్లు పెట్టుబడులు పెట్టినప్పుడు కమ్మగా ఫీలయిన జగన్ కు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటనతో చలి మొదలైందన్నారు. ఎన్నికల కమిషన్  అనేది కళ్యాణ మండపం లాంటిదని, ఎన్నికలు జరిగేటప్పుడు అది కళకళలాడుతుందని, మిగతా సందర్భాలలో వెలవెలబోతుందన్నారు. ఎన్నికల కమిషనర్ ని నియమించేది గవర్నర్ అనే విషయం కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నాడన్నారు. కడప జిల్లా కోడూరులో ఒక ఎస్సై, నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతిపక్షపార్టీ అభ్యర్థిని ఎత్తుకెళ్లి బయటపడేశాడని, అతను అంత అత్యుత్సాహం ఎందుకు చూపాడని చెంగల్రాయలు మండిపడ్డారు. 

నామినేషన్ పత్రాల్లో చిన్నచిన్న తప్పులను పట్టించుకోవాల్సిన పనిలేదని ఎన్నికల కమిషన్ చెప్పినా కూడా, రాష్ట్రంలోని అధికారులు ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కుంటిసాకులు చెబుతూ, అడుగడుగునా ప్రతిపక్షపార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం జరిగిందన్నారు. నామినేషన్ల అంశంలో పరిశీలన అనే పదానికి తీసేయడమనే అర్థం వచ్చేలా అధికారులు వ్యవహరించారన్నారు. 

read more  కరోనా నియంత్రణను అడ్డుకున్నది నిమ్మగడ్డ, చంద్రబాబులే...ఎలాగంటే: సజ్జల సంచలనం

పోలీసులు కూడా అభ్యర్థులను అడ్డుకోవడం, అధికారపార్టీ నేతలు చెప్పినవిధంగా ప్రవర్తించడం జరిగిందన్నారు. అభ్యర్థి, బలపరిచే వ్యక్తి లేకుండానే కడప జిల్లాలో చాలాచోట్ల ఎన్నికల నామినేషన్ ను ముగించారన్నారు. తన సొంత జిల్లాలో జరిగిన అనేక సంఘటనలు, ఎన్నికల్లో గెలుపుకోసం చేసిన ఆకృత్యాలపై జగన్ ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. 

కోడూరు మండలం రెడ్డివారిపల్లెలో ప్రతిపక్షపార్టీ అభ్యర్థి ఇంట్లో ఎక్సైజ్ అధికారులే మందుసీసాలు పెట్టారని, ఆ తరువాత డీఎస్పీస్థాయి అధికారి నేరుగా సదరు అభ్యర్థి ఇంటికెళ్లి ''నీ మీద కేసుపెడతాను..నువ్వు నామినేషన్ వేయడానికి వీల్లేదు'' అని అతన్ని బెదిరించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా అనేకచోట్ల అభ్యర్థులను పలురకాలుగా బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసి ఆ స్థానాలను ఏకగ్రీవమైనట్లుగా చెప్పుకోవడం అధికారపార్టీకే చెల్లిందన్నారు. 

వచ్చిన నామినేషన్లు పరిశీలించి అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాల్సిన అర్డీవో స్థాయి అధికారులు కూడా తమ విధులను సరిగా నిర్వర్తించలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో వివస్త్రను చేసేలా కడపజిల్లాలో అనేక సంఘటనలు జరిగాయన్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన 45 సంఘటనలకు సంబంధించి ఆధారాలను తాము ఎన్నికల కమిషనర్ ముందుంచుతున్నామని, అవి పరిశీలించి వారేం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. 

హింసకు పాల్పడిన అధికారులు, పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్ర డీజీపీ మాదిరిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా కోర్టుల్లో నిలబడే పరిస్థితి తెచ్చుకోవద్దని టీడీపీ ఎమ్మెల్సీ సూచించారు. 

read more   అంతుచూస్తానంటూ ఈసీకి చంద్రబాబు బెదిరింపులు... అందువల్లే...: పేర్ని నాని

జగన్మోహన్ రెడ్డికి 5కోట్ల మంది ప్రజలకంటే 5వేల కోట్ల డబ్బులే ముఖ్యమైపోయాయని... ఆ డబ్బు ఎక్కడికీ పోవని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కపైసా కూడా బయటకు పోదని, ప్రభుత్వానికి నిజంగా సత్తా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో నిర్వహించాలని చెంగల్రాయలు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ, నియంతృత్వ చర్యలను ప్రకృతే కరోనా రూపంలో వచ్చి కట్టడి చేసిందన్నారు చెంగల్రాయలు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios