అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మోదీ అడుగుపెడితే ఖాళీ కుండలు బద్దలు కొడతామని హెచ్చరించారు. ప్రధాని ఏపీలో ఏ ప్రాంతానికి వచ్చినా తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం చేశారు. 

దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో మోడీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని చెప్పుకొచ్చారు. కోల్ కత సభ మోడీ పతనానికి నాంది పలికిందన్నారు. అమరావతి సభతో అది ఖరారవుతుందని జోస్యం చెప్పారు. 

బీజేపీ అధినాయకత్వంపై వ్యతిరేకతతోనే ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల రాజీనామా చేస్తున్నారన్నారు. కన్నా నాయకత్వంలో ఏపీలో బీజేపీ గుండు సున్నా అయిపోతుందని ఎద్దేవా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావులు ఏపీలో బీజేపీనీ భ్రష్టుపట్టిస్తున్నారన్నారు.

 బీజేపీని భవిష్యత్ లో వేరే పార్టీలో విలీనం చేసినా ఆశ్చర్యం లేదన్నారు. మరోవైపు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. అయితే తమ పార్టీ నేతలు మాత్రం రాధతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు.