వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైరయ్యారు. గురువారం వరుస ట్వీట్లతో ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. 20 బ్యాచ్ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లిపోయారని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

వీళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. జైలులో ఉండాల్సిన నిందితులు బయట ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో జగన్, విజయసాయిరెడ్డిని చూస్తుంటే అర్థమవుతోందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

కోర్టులు, న్యాయవాదులు, జడ్జిలపై దాడికి పాల్పడే విధంగా నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదంగా వ్యవహరిస్తున్న11 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్, ఏ2 విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గా అంతకు ముందు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా బుద్ధా వెంకన్న డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో పార్టీ నేతలతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ భౌతిక దూరం పాటించకుండా విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.

ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రజలు వెళ్లొద్దని పోలీస్ అధికారులు చెప్పటమే కాదు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపుతున్నారని కానీ ఈ నిబంధనలు వైసీపీ నేతలకు మాత్రం వర్తించటం లేదన్నారు.

ఒక ఎంపీగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలా నిబంధనలు గాలికి వదిలి కరోనా వ్యాప్తికి కారణం అవుతూ సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు.? అంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు .