అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన అంశంపై తాను నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనను అర్థరాత్రి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. 

ఎమ్మెల్సీవి ఎమ్మెల్సీగా ఉండాలని హెచ్చరించారని లేకపోతే ఎంపీలంతా కలిసి జైల్లో వేయించి నట్లు తిప్పుతారంటూ బెదిరించడం జరిగిందన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గురువారం రాత్రి ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఇంట్లో ఉండే బెదిరించారని చెప్పుకొచ్చారు. 

అర్థరాత్రి 10.45 నిమిషాలకు ఫోన్ చేసి పదేపదే తనను బెదిరించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ రాజ్యసభ సభ్యులపై స్పందిస్తే బాగోదని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారన్నారు. 

తన రాజకీయ జీవితంలో మెుదటి సారిగా తాను బెదిరింపులకు పాల్పడ్డానని ఆయన ఆరోపించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు తెలుసునన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అయినా ఆయన ఇలా ఫోన్ చేసి బెదిరిస్తారని అనుకోలేదన్నారు.