విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కుట్ర పూరిత, కక్షపూరిత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. అందులో భాగంగానే డ్రోన్లు వినియోగించారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబుకు భద్రత పెంచాలని హైకోర్టు చెప్పినా దానిని కూడా బేఖాతరు చేశారంటూ మండిపడ్డారు. కావాలనే చంద్రబాబు ఇంటిని డ్రోన్‌తో అడుగడుగున విజువల్స్ తీశారని ఆరోపించారు. చంద్రబాబును‌ హతమార్చే కుట్రలో భాగంగానే డ్రోన్‌తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు ఇంటిపై మంత్రులే రెక్కి నిర్వహిస్తున్నారని‌ తమకు అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ కుట్రలను భగ్నం ‌చేసేందుకు పోరాడతానని చెప్పుకొచ్చారు.   చంద్రబాబును‌ రక్షించుకోవడం కోసం అవసరమైతే జగన్ ఇంటి ముందు ఆత్మహత్య ‌చేసుకుంటానని హెచ్చరించారు. 

చంద్రబాబు భద్రతపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాకి లేఖరాస్తానని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. వరదల వల్ల లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జగన్ మాత్రం అమెరికాలో విలాశవంతమైన జీవితం గడుపుతున్నారంటూ విమర్శించారు బుద్దా వెంకన్న.