అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. సీఎం కొడుకు మంత్రి అయి ఉండి ఓడిపోయిన లోకేష్ చెల్లని కాసు అనడంపై మండిపడ్డారు. 

ఒకసారి ఓడిపోతేనే చెల్లని కాసు అంటే, 2014 లో మీ పార్టీ గౌరవ అధ్యక్ష పదవిలో ఉండి 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు విజయమ్మ. మీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన బాబాయిని, సొంత ఊరిలో గెలిపించుకోలేని వాళ్ళని ఏమని అంటారు ? మీరు చెప్తారా విజయసాయిరెడ్డి అంటూ నిలదీశారు. 

ఇకపోతే నారా లోకేశ్‌ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు నారా లోకేష్ అంటూ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ కు కౌంటర్  ఇచ్చారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.