ఆదివారం అరెస్టైన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి జిల్లా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కుటుంబసభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడిన అనంతరం రవిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న(ఆదివారం)చెన్నైలో రవిని పోలీసులు అరెస్ట్ చేసి పులివెందులకు తీసుకువచ్చారు. 

పులివెందుల్లో ఆసుపత్రికి తరలించిన అనంతరం రవిని సోమవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 2018 లో పులివెందుల పూల అంగళ్ల సర్కిల్‌లో జరిగిన అల్లర్లు, ఘర్షణ కేసులో బీటెక్ రవి నిందితుడిగా ఉన్నాడని...అప్పట్లో రాళ్లతో దాడి, హత్యాయత్నం కేసులో వారెంట్ పెండింగ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. 

ఇరు వర్గాలకు చెందిన 253 మందిపై కేసు నమోదు అయిందని తెలిపారు. టీడీపీ రాళ్ళ దాడిలో ఎస్సై చిరంజీవి గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి 307 హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం నాడు చెన్నైలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై బీటెక్ రవి వీడియో విడుదల చేశారు. అంతర్జాతీయ నేరస్తుడి స్థాయిలో తనను వెంటపడి పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి  పోలీసుల తీరుపై మండిపడ్డారు.

అరెస్టులు తనకు కొత్తేం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై కూడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. బెంగుళూరు నుండి చెన్నైకు వచ్చిన సమయంలో ఎయిర్ పోర్టులో తనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.

వైసీపీ కక్షపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. చలో పులివెందుల కార్యక్రమం సందర్భంగా బాధిత కుటుంబం నుండి పిర్యాదు మేరకు కేసులునమోదు చేశారని  పోలీసులు చెప్పారన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తమ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ బీటెక్ రవి అరెస్ట్ ను బాబు తీవ్రంగా ఖండించారు.