అమరావతి: బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా తామే చేశామని బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు ఇద్దరూ పవర్ బ్రోకర్స్ అంటూ మండిపడ్డారు. 

వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి యూసీలు ఇవ్వలేదంటూ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. వెనుకబడిన ప్రాంతాల నిధులకు సంబంధించి తాము యూసీలు ఎన్నోసార్లు ఇచ్చామని అవసరమైతే ఆధారాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. 

యూసీలు ఇచ్చినట్లు నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని అలాగే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన విషయం గుర్తు లేదా అని విమర్శించారు. అసత్యాలు చెప్పిన విష్ణువర్థన్ రెడ్డి వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.  

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ వీధి నాయకుడిలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఒక బజారు మనిషి మాట్లాడే విధంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకు దేశవ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఏపీలో బీజేపీ నాయకులను చంద్రబాబు నాయుడు పాలు పోసి పెంచారని ఇప్పుడు వాళ్లు అడ్డుకుంటారా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే బీజేపీ నేతలు ఇళ్లలోంచి బయటకు రాగలరా అని ప్రశ్నించారు. బీజేపీ నేతల్లారా ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. జాగ్రత్తగా మాట్లాడాలని లేనిపక్షంలో తగిన  గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.