విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో హాట్ హాట్ గా జరుగుతున్న కృష్ణా జిల్లా రాజకీయాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు ఉయ్యూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పట్ల వంశీ అనుచితంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆధారాలను సైతం పోలీసులకు అందజేశారు. 

అంతకుముందు ఉయ్యూరులోని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. వంశీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరడంతో ఉయ్యూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. 

ఇకపోతే ఒక ప్రముఖ ఛానెల్ డిబేట్ లో టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజేంద్రప్రసాద్ పై వంశీ అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. 

ప్రజలు వీక్షిస్తున్నారన్న విషయం కూడా మరచిపోయి ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. రాయడానికి వీల్లేని విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. పగులుద్దీ అంటూ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు సోషల్ మీడియాలో వంశీ, రాజేంద్రప్రసాద్ ల మధ్య జరిగిన సంభాషణే హాట్ హల్ చల్ చేస్తోంది. వంశీ వాడిన అసభ్య పదజాలంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయ్యప్పమాలలో ఉంటూ ఇలా మాట్లాడతారా అంటూ పెదవి విరుస్తున్నారు.  

వల్లభనేని వంశీకి అయన తండ్రిని జన్మనిస్తే, చంద్రబాబు నాయుడు రాజకీయ జన్మనిచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యామిలికి దగ్గర అయిన దాసరి కుటుంబాన్ని పక్కనబెట్టి మరీ వంశీకి చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. 

ఇకపోతే మాజీమంత్రి దేవినేని ఉమాపై వంశీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రాజేంద్రప్రసాద్. డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా వంశీ తరలించడానికి ప్రయత్నిస్తే దేవినేని ఉమా మోటార్లు అపుడే పెట్టొద్దన్నారని గుర్తు చేసారు అందుకు చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారని రాజేంద్రప్రసాద్ తెలిపారు.  

అప్పుడే లైవ్ లోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేంద్ర అన్నా అంటూ మెుదలుపెట్టిన వంశీ అనంతరం సహనం కోల్పోయారు. డొక్క పగులుద్ది, నోరూ మూస్కోవోయ్, ఆ భూములు నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా, ఎవరి పొలానికి నీళ్లు ఇచ్చార్రా అంటూ బండబూతులు తిట్టారు. 

అక్కడితో ఆగిపోలేదు నోరు మూయరా, ఒంటికన్నుగా, చెత్త****,చెత్త****** చెప్పు తెగుతుంది రాజేంద్ర అంటూ బూతుపురాణం మెుదలెట్టేశారు. ఏదిపడితే అది మాట్లాడితే మెహం పగిలిద్ది అంటూ చిర్రుబుర్రులాడారు. జోకర్, బఫూన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాయడానికి కూడా వీల్లేని విధంగా బండబూతులు తిట్టారు వంశీ మోహన్.  

అంతటితో ఆగిపోలేదు బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎలా ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారో వల్లభనేని వంశీ పూస గుచ్చినట్లు వివరిస్తే... వల్లభనేని వంశీ ఎలా ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కించుకున్నారో బాబూ రాజేంద్రప్రసాద్‌ సవివరంగా చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల పంపకాలు ఎలా జరుగుతాయో, ఏ విలువలకి తిలోదకాలిచ్చి టీడీపీ రాజకీయాలు చేస్తోందో ప్రస్తుత, మాజీ నేతల మధ్య ఈ బూతుల యుద్ధం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. 

వల్లభనేని వంశీమోహన్ బూతు పురాణంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే అయ్యప్పమాలలో ఉన్న వంశీ తిట్లపురాణంపై సర్వత్రా చర్చజరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ ఎమ్మెల్సీపై వల్లభనేని వంశీ అసభ్యపదజాలం...అది కూడా లైవ్ లో

నారా లోకేశ్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు