ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు  కొనసాగుతున్న సమయంలో మాజీ ఉద్యోగసంఘాల నాయకుడు, టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెెస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అరెస్ట్ ను టిడిపి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష టిడిపి (TDP) నాయకులపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు (atchannaidu), దూళిపాళ్ల నరేంద్ర (dhulipalla narendra), చింతమనేని ప్రభాకర్ (chintamaneni prabhakar), బిసి జనార్ధన్ రెడ్డి (bc janardhan reddy) వంటి నాయకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి వైసిపి (ysrcp) ప్రభుత్వం అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. వీరు కోర్టుల నుండి బెయిల్ పొంది బయటకువచ్చారు. అయితే తాజాగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో మాజీ ఉద్యోగసంఘాల నాయకుడు, టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు (ashok babu)పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడి పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు సర్వీస్ లో ఉన్న సమయంలో పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారంటూ ఆరోపణలున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధృవపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో అశోక్ బాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త. సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా... గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి 11.15 నిముషాలకు అశోక్ బాబును ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు తెలిపారు. ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్ బాబు రాత్రి సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో మాటువేసిన సిఐడి పోలీస్ ఆయనను అరెస్టు చేసి తమ వాహనంలోనే స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్ట్ పై అశోక్ బాబు కుటుంబ సభ్యులతో పాటు టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అశోక్ బాబు అరెస్ట్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి... అరాచకంతో పాలన సాగిస్తున్నారని అన్నారు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అర్దరాత్రులు అరెస్టులతో ‎వేధిస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయటాన్ని ఖడిస్తున్నట్లు పేర్కొన్నారు. 

''అశోక్ బాబును అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? గతంలో అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలింది. కానీ కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోంది'' అని మండిపడ్డారు. 

''గతంలో ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే వైసీపీ ప్రభుత్వం ఆయనపై కక్షసాధిస్తోంది. అక్రమ కేసులకు భయపడేవారెవరూ టీడీపీ లేరు. అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలి. జగన్ రెడ్డి ఇకనైనా పద్దతి మార్చుకుని పాలన సాగించాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కూడా ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్ ను ఖండించారు. ఉద్యోగులలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్ బాబు అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. ఉద్యోగులు హక్కులు కోసం మాట్లాడమే అశోక్ బాబు చేసిన నేరమా? ఈ అక్రమ అరెస్టులతో ప్రజా వ్యతిరేకతను ఆపలేరని అన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని ఆనంద్ బాబు హెచ్చరించారు. 

టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూడా ఆశోక్ బాబు అరెస్ట్ పై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశాలపైనుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తిని అర్థరాత్రి అరెస్టు చెయ్యాల్సిన అగత్యం ఏమోచ్చిందని నిలదీసారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉందని నరేంద్ర హెచ్చరించారు.