Asianet News TeluguAsianet News Telugu

జేసీ దివాకర్ రెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు: టికెట్ కు ఎసరు?

ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. అంతేకాదు ఎప్పుడు ఎలా ఉంటారో అన్నది చెప్పడం కూడా కష్టమే. ఒక్కోసారి పొగుడుతుంటారు. మరోసారి తిడతారు. ఆ తిట్లు కూడా పొగిడినట్లే ఉంటాయి సుమా. తనకు నచ్చితే అంతా ఆమోదించాల్సిందే అంటారు. తనకు నచ్చనిది ఎవరికీ నచ్చకూడదంటారు. 
 

TDP MLAs revolt against JC Diwakar Reddy
Author
Ananthapuram, First Published Dec 4, 2018, 5:14 PM IST

అనంతపురం: ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. అంతేకాదు ఎప్పుడు ఎలా ఉంటారో అన్నది చెప్పడం కూడా కష్టమే. ఒక్కోసారి పొగుడుతుంటారు. మరోసారి తిడతారు. ఆ తిట్లు కూడా పొగిడినట్లే ఉంటాయి సుమా. తనకు నచ్చితే అంతా ఆమోదించాల్సిందే అంటారు. తనకు నచ్చనిది ఎవరికీ నచ్చకూడదంటారు. 

తాజా ఆయనగారు ఏం చేశారంటే తన పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వారిని మార్చెయ్యాలని సీఎం గారి మీద ఒత్తిడి పెంచేశారు. ఈ విషయం గమనించిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఓ మంత్రి కలిసి ఆయన గారి మీద తిరుగుబాటు చేశారు. 

మరి నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నట్లు జేసీ చెప్పిన దానికి వందేసి చెప్పి ఆయన సీటుకే ఎసరుతెచ్చే పనిచేశారు. దీంతో ఒకరికి ఎసరుపెడదామనుకుంటే తన సీటుకే ఎసరు రావడంతో జేసీ బొక్క బోర్లా పడ్డారు. రివర్స్ ఫిట్టింగ్ తో కంగుతిన్నారు.

ఇప్పటికే అర్థమైందనుకుంటా...ఈ తరహా రాజకీయాలు చోటు చేసుకుంది ఎక్కడో కూడా తెలిసి పోయింది కదూ. ప్రశాంతంగా ఉన్న ఎమ్మెల్యేలను గెలికి రచ్చరచ్చ చేసుకున్న ఆ నాయకుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకెవరు వివాదాస్పద నాయకుడు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి స్టైల్ వేరు, ఆయన రూటే సెపరేట్. అలాంటి వ్యక్తికి జిల్లాలో ప్రతికూల పరిస్థితులు పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

తెలుగుదేశం హయాంలో అనంతపురం జిల్లాను ఏలుదామని ప్రయత్నించిన ఆయనకు సొంతపార్టీ నేతలే అడ్డుతగులుతుండటం మింగుడు పడటం లేదట. ఇంతకీ జేసీకి వచ్చిన చిక్కేంటి...అడ్డుకుంటున్న సొంతపార్టీ నేతలు ఎవరు...ఎందుకు తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చింది ఈ ప్రశ్నలకు చిక్కుముడి వీడాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

అసలు విషయానికి వస్తే రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి అనుకున్న పదవులను అధిరోహించినట్లే. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రోటెం స్పీకర్ గా, ఆఖరికి ఎంపీగా ఇలా రాజకీయాల్లో ఒక్కో అడుగు మెట్లు ఎక్కుతూ అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోను ఆయనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 

రాజకీయాల్లో చక్కటి సామెతలు చెప్పే జేసీ దివాకర్ రెడ్డి కూడా ఓ సామెతను ఫాలో అవుతున్నారు. అదేంటంటే దీపముండగానే ఇల్లు సర్ధుకోవాలని...అంటే తాను ఉండగానే తన రాజకీయ వారసుడుగా కుమారుడిని చట్ట సభల్లోకి పంపించాలన్నది ఆయన ఆలోచన. 

ఎప్పుడైతే తన కుమారుడి పవన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని జేసీ దివాకర్ రెడ్డి భావించారో ఆ నాటి నుంచి వ్యూహరచన చెయ్యడం మెుదలెట్టేశారు. అనంతపురం ఎంపీగా కుమారుడిని బరిలోకి దింపుదామనుకున్న ఆయన నియోజకవర్గాలపై దృష్టిసారించారు. 

అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణ దుర్గం, శింగనమల, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలు అనంతపురం లోక్ సభ పరిధిలోకి వస్తాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 

అనంతపురం నియోజకవర్గానికి ప్రభాకర చౌదరి, తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి, రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు, కల్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, గుంతకల్లులో జితేందర్ గౌడ్, శింగనమలలో యామిని బాల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే ఉరవకొండ నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే  విశ్వేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. ముందు తనకు ఏ ఎమ్మెల్యేలు కలిసివస్తారో అని ఆలోచించారు.  దాదాపుగా ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీలో ముదురు నేతలు కావడంతో తన ఆలోచనకు సహకరించరని భావించిన జేసీ దివార్ రెడ్డి ఎమ్మెల్యేల మార్పుకు ప్రయత్నించారు. 

తనకు అనుకూలంగా ఉండే వాళ్లను ఆయా నియోజవర్గాల్లో తెరపైకి తీసుకువచ్చారు. వారితో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో జేసీ మద్దతుదారులకు తాజా ఎమ్మెల్యేలకు నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మెుత్తానికి జేసీ మద్దతుదారులు వాళ్లు పనిలో వాళ్లు బిజీగా ఉంటే జేసీగారు ఆయన నరుకుడులో ఆయన ఉన్నారు. 

స్వయంగా సీఎం చంద్రబాబును కలిసి అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వారిని మార్చెయ్యాలని కొత్తవారిని బరిలోకి దింపకపోతే పార్టీ ఓడిపోతుందని చెప్పేశారు. వాస్తవానికి ఎమ్మెల్యేలపై కూడా కాస్త నెగెటివ్ టాక్ ఉంది కూడా.
  
తమపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు చెయ్యడంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యేలు అంతా ఏకమయ్యారు. జేసీ ఉపయోగించిన అస్త్రాన్నే ఉపయోగించారు. జేసీకి రివర్స్ ఫిట్టింగ్ పెట్టారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి చంద్రబాబుకు జేసీ దివార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 

అయితే మంత్రి, ఎమ్మెల్యేల ఫిర్యాదును సీఎం చంద్రబాబు లైట్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు తాను చెప్పినట్లు వింటారని జేసీ వినడని, జేసీ వారందరి కంటే ఆర్థిక, అంగ బలాల్లో దిట్ట కావడంతో చంద్రబాబు మిన్నకుండిపోయారు. 

అయితే నియోజకవర్గాల్లో నిత్యం గొడవలు జరుగుతుండటం, ఇటీవలే రెండు రోజులపాటు అనంతపురంలో చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో వాస్తవాలు గ్రహించారు. ప్రజల్లో నెగెటివ్ టాక్ ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. 
 
అదే సమయంలో జేసీ వ్యతిరేక వర్గమంతా చంద్రబాబు దగ్గర వాలిపోయారు. పవన్ రెడ్డిని అనంతపురం ఎంపీగా బరిలో దింపితే ఓటమి ఖాయమని మంత్రి, ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే జేసి మీదే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని మళ్లీ ఆయన తనయుడు అంటే ప్రజలు అంగీకరించరని చెప్పేశారు. 

అప్పటికే జేసీకి సీఎం చంద్రబాబు ఓ కండీషన్ కూడా పెట్టేశారు. పవన్ రెడ్డిని ఎంపీగా పోటీ చెయ్యించాలంటే ఆ లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేల అనుమతితో లెటర్ తీసుకురావాలని ఆదేశించారు. అయితే ఆ కండీషన్ నచ్చకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి ఆ ప్రయత్నం చెయ్యలేదు. కానీ మద్దతు దారులతో మాత్రం హల్ చల్ చేయిస్తున్నారట.

ఎంపీ జేసి దివాకర్ రెడ్డి తన అనుచరులతో తమ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి వర్గాలను తయారు చేశారని ఫలితంగా తాము ఇబ్బందులు పడుతున్నట్లు తమ బాధలు చెప్పుకొచ్చారట. దాంతో ఎంపిగా పవన్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వటం సాధ్యం కాదని జేసికి చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారని టాక్ నడుస్తోంది.ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారతాయో వేచి చూడాలి మరి.  

Follow Us:
Download App:
  • android
  • ios