వైఎస్ జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్‌లను తిరిగి తెరవాలంటూ తెలుగుదేశం నేతలు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నా క్యాంటీన్లను తానే నడుపుతానంటూ రంగంలోకి దిగారు.

విశాఖ కేజీహెచ్ దగ్గరున్న అన్నా క్యాంటీన్‌ను ఆయన తిరిగి ప్రారంభించారు.. గతంలో కంటే మంచి భోజనం పెడతానని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్నా క్యాంటీన్‌లను తెరిచే వరకు కేజీహెచ్ వద్ద వున్న అన్నా క్యాంటీన్‌ను తన సొంత నిధులతో నిర్వహిస్తాన్నారు. రోజుకు 300-350 మంది భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గణేశ్ తెలిపారు.

విశాఖ కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారని.. వీరిలో 500 నుంచి 600 మంది అన్నా క్యాంటీన్‌లో భోజన వసతి పొందేవారని కానీ... ప్రభుత్వం వీటిని మూసివేయడం వల్ల నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడికెక్కడి నుంచో వచ్చే వారికి విశాఖలో భోజనం చేయ్యాలంటే సుమారు రూ.150 రూపాయలు పెడితే గానీ దొరకడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేదల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రతీ రోజు మధ్యాహ్నం 12.30కి భోజనం పెడతామని గణేశ్ కుమార్ తెలిపారు.