శ్రీకాకుళం: తనపై ఆరోపణలు చేసిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామ సుందర శివాజీ నిర్ణయించుకున్నారు. జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. జనవరి 29న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జగన్ తన పాదయాత్రను ముగించారు. 

పాదయాత్రలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించి టీడీపీ ప్రభుత్వం, స్థానిక టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో గౌతు శివాజీపై జగన్ ఆరోపణలు చేశారు.

జగన్ వ్యాఖ్యలను గౌతు శివాజీ సీరియస్‌గా తీసుకున్నారు. వైసీపీ అధినేతకు లీగల్ నోటీసులు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. పలాస బహిరంగ సభలో తమ కుటుంబంపై జగన్ విమర్శలు చేసినట్లు శివాజీ చెబుతున్నారు.