జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కి టీడీపీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు పంపించారు. ప్రస్తుతం పవన్.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పవన్.. స్థానిక ఎమ్మెల్యే పై పలు ఆరోపణలు చేశారు. దీంతో పవన్ పై ఎమ్మెల్యే గౌతు శివాజీ సీరియస్ అయ్యారు.

తాను సర్దార్‌ గౌతు లచ్చ న్న కుమారుడినని, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను, తన కుటుంబం ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట్‌ చదివి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మా కుటుంబ వ్యక్తి పై ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినీతి ఆరోపణలు చేసిన పవన్‌కు ఇప్పటికే లీగల్‌ నోటీసులు పంపించామని చెబుతూ వాటి ప్రతులను విలేకరులకు అందించారు. నియోజకవర్గం లో తానంటే ఏమిటో అందరికీ తెలుసని, జిల్లా లో సీనియర్‌ ఎమ్మెల్యేగా జిల్లాలో ఏ కార్య క్రమంలోనైనా ముక్కు సూటిగా మాట్లాడుతూ స్వపక్షంలో విపక్ష నేతగా గుర్తింపు పొందానన్నారు.
 
కుమారుడైనా, అల్లుడైనా యార్లగడ్డ వెంకన్న చౌదరి అండగా ఉన్నారని, తమ కుటుంబీకుల అభీష్టం మేరకు ఆయనకు అన్ని పగ్గాలు అప్పగించామన్నారు. కిడ్నీ వ్యాధులపై స్పందించడం లేదని నినదించడం తగదని, విశాఖపట్నానికే పరిమితమైన డయాలసిస్‌ కేంద్రాలను పలాస, సోంపేటకు తీసుకువచ్చామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలకు కట్టుబడి నిలబడి నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలన్నారు. పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు.