తక్కువ రేటుకి కరెంట్ ఇస్తామంటే.. ఎందుకు వద్దు, జగన్ కక్కుర్తి వల్లే పవర్ కట్‌లు : పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్‌లో పవర్ కట్‌ల నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా దానిని కాదని ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పవర్ కట్‌ల నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ స్వార్థపూరిత నిర్ణయాలు విద్యుత్ రంగాన్ని, ప్రజలను ముంచాయని ధ్వజమెత్తారు. అసమర్దత, నాసిరకం బొగ్గు కొనుగోళ్లు, కమీషన్ల కక్కుర్తితో విద్యుత్ రంగాన్ని జగన్ దెబ్బతీశారని కేశవ్ ఆరోపించారు. తాను అందిస్తున్న సంక్షేమం కంటే విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచి ఆయన దోచుకుంటున్నదే ఎక్కువగా వుందని పయ్యావుల చురకలంటించారు.
2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రజలు కరెంట్ ఛార్జీల కింద ఎంత చెల్లించారు... ఇప్పుడెంత చెల్లిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు. జగన్ పాలనలో సామాన్యుల విద్యుత్ వాడకం పెరగకపోగా.. విద్యుత్ ఛార్జీలు మాత్రం పెరిగాయన్నారు. ఓ వైపు తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా దానిని కాదని ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేస్తోందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. హిందూజ సంస్థకు రూ.2,200 కోట్లు ఎందుకు చెల్లించిందని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసమే జగన్ ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. ఇది చాలదన్నట్లు స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజల నుంచి భారీగా దోపిడీ చేసేందుకు పథకం వేసిందన్నారు.
రాష్ట్ర విభజన నాటికి ఏపీ 22 వేల కోట్ల మిలియన్ యూనిట్ల లోటుతో వుండగా.. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకా 2019 నాటికి ఏపీ మిగులు విద్యుత్‌తో నిలిచిందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జగన్ ఒక్క మెగావాట్ విద్యుత్‌ను అదనంగా తయారు చేసింది లేదన్నారు. 8 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను అదానీకి కట్టబెట్టినదానిలో అవినీతికి స్కెచ్ గీశారని.. కానీ న్యాయస్థానం జోక్యంతో ప్రజలు బతికి పోయారని పయ్యావుల కేశవ్ అన్నారు.