Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే పిల్లల చిక్కీ, పాలు ఎందుకు ఆగినట్లు : జగన్‌పై పయ్యావుల విమర్శలు

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పారని ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రాష్ట్ర పరిస్ధితి బాగుంటే చిన్నారులకు ఇచ్చే చిక్కీ, పాలు ఎందుకు ఆగినట్లు అని ఆయన ప్రశ్నించారు. 

tdp mla payyavula keshav fires on ap cm ys jagan over ap financial status
Author
First Published Sep 18, 2022, 3:27 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేసి, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సీఎం ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పారని కేశవ్ ఆరోపించారు. అధికారులు ఇచ్చినవి కాకుండా, కావాలనే జగన్ అబద్ధాలు చెప్పారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి బాగుంటే ఉద్యోగుల జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలోనూ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని కేశవ్ దుయ్యబట్టారు. 

రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగోలేదు కాబట్టే చిన్నారులకు చిక్కీ, పాలని కూడా ప్రభుత్వం నిలిపివేసిందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణం నిమిత్తం వచ్చిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. పథకాల అమలుకు నిధులు లేవని ప్రభుత్వమే స్వయంగా న్యాయస్థానంలో అఫిటవిట్ దాఖలు చేసిందని కేశవ్ గుర్తుచేశారు. మరోవైపు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసే సందర్భంగా పుల్ దెమ్ ఔట్ అని ఎలా అంటారంటూ పయ్యావుల ప్రశ్నించారు. స్పీకర్ ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అనే విషయాన్ని తమ్మినేని సీతారామ్ గుర్తించాలని కేశవ్ హితవు పలికారు. 

కాగా.. శుక్రవారం అసెంబ్లీలో పెట్టుబడులు , పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా బాగోలేదని, అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తోందన్నారు. వీరందరికీ పవన్ కల్యాణ్ కూడా తోడుగా వుంటారని జగన్ ఎద్దేవా చేశారు. లేనిది సృష్టించడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. ఆర్ధికంగా రాష్ట్రం బాగుంది అని చెబితే... కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయనంటూ జగన్ వ్యాఖ్యానించారు. 

ALso Read:రాష్ట్రం ఆర్ధికంగా బాగుంది.. ఈ మాటంటే బాబుకే నచ్చదేమో, ఏపీ అప్పుల చిట్టా ఇదే : అసెంబ్లీలో జగన్

కోవిడ్ లాంటి సవాళ్లు ఎదురైనా , గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, దేశంలోని చాలా రాష్ట్రాల కంటే బాగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.4 శాతం నెరవేర్చామని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రం బాగున్నా..  చంద్రబాబు ఆయన బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోయిందని నమ్మించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో జీడీపీ పెరుగుదల గతంలో కంటే చాలా బాగుందని సీఎం అన్నారు. చంద్రబాబు హయాంలో 5.36 శాతంగా వున్న జీడీపీ గ్రోత్ రేట్.. వైసీపీ పాలనలో 6.89 శాతానికి పెరిగిందని జగన్ పేర్కొన్నారు. 

జీడీపీ గ్రోత్ రేట్‌లో రాష్ట్రం దేశంలోనే ఆరో స్థానంలో వుందని సీఎం వెల్లడించారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో గత మూడేళ్లుగా తొలి మూడు, నాలుగు స్థానాల్లోనే వున్నామని జగన్మోహన్ రెడ్డి వివరించారు. తాజాగా 2021-22లో రాష్ట్ర జీడీపీ గ్రోత్ రేట్ 11.43 శాతంగా వుందన్నారు. జీడీపీ గ్రోత్ రేట్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో వుందని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 4.45 శాతంగా వుండేదని.. వైసీపీ పాలనలో అది 5 శాతానికి చేరిందని జగన్ వెల్లడించారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా.. వస్తువులకు డిమాండ్ తగ్గకుండా పథకాల ద్వారా పేదల్ని ఆదుకోవడమే రాష్ట్ర పురోగతికి కారణమని సీఎం వివరించారు. 

2014లో రాష్ట్రం అప్పు లక్షా 20 వేల కోట్లని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు దిగిపోయే సమయానికి ఏపీ అప్పు 2 లక్షల 69 వేల కోట్లని ముఖ్యమంత్రి తెలిపారు . చంద్రబాబు హయాంలో అప్పులు ఏకంగా 123.52 శాతం పెరిగాయని జగన్ వివరించారు. అంటే ఏడాదికి 17.45 శాతం చొప్పున అప్పులు పెరిగాయని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.3.82 లక్షల కోట్లని.. మూడేళ్లలో 41.83 శాతం పెరిగిందని జగన్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఏడాదికి 12.73 శాతం చొప్పున మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios