అమరావతి: తమతో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల జాబితాను వైసీపీ నేతలు బయటపెట్టాలని  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  డిమాండ్ చేశారు. వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని  ఆయన  అభిప్రాయపడ్డారు.

శుక్రవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు.  తనతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని గతంలో జగన్ ప్రకటించిన సమయంలో  ఏం జరిగిందో మీకు తెలుసునని కేశవ్ గుర్తు చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని   జగన్ ప్రకటించడం వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌‌గా ఆయన అభిప్రాయపడ్డారు.  వైసీపీ నేతలతో టచ్‌లో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో  సంక్షేమం తప్ప అభివృద్ది కన్పించడం లేదన్నారు.  రాజధాని గురించి కూడ ఎక్కడ ప్రస్తావించలేదని  కేశవ్ చెప్పారు.