అమరావతి: తనపై విమర్శలు చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. మున్నిపల్లో ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు. తన ప్రసంగంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

తాను తిడితే తనంత బూతులు తిట్టేవారు మరొకరు ఉండరని ఆయన అన్నారు. తనకు సంస్కారం ఉందని, అయితే ఎదుటివాళ్లు నోరు పారేసుకుంటే ఊరుకోనని ాయన అన్నారు. తనకు ఒక్క పని కాదు, అనేక పనులు ఉన్నాయని చెప్పారు. 

బసవతారకం ఆస్పత్రి చైర్మన్ గా తాను రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతున్నానని బాలకృష్ణ చెప్పారు. 

ఇదిలావుంటే, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రచారం సాగిస్తున్నారు. గాజువాక పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. వైసీపీ ఓటేస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు, పన్నుల పెంపునకు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. వైసీపీ అభ్యర్థులందరూ నేరచరిత ఉన్నవారేనని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లుండి ప్రచార దశ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారం జోరును పెంచారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రచారం సాగిస్తున్నారు. మంత్రులు తమ తమ జిల్లాల్లో అభ్యర్థులను వెంట పెట్టుకుని వైసీపీ తరఫున ప్రచారం సాగిస్తున్నారు. వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి జీవీఎంసీ పరిధిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.