గుంటూరు జిల్లాకు చెందిన దళిత నేత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు జనసేనలో చేరిన ఘటన మరవకముందే.. సీనియర్ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలోని ఓ తోటలో రెడ్డి సామాజికవర్గం వారు ఆదివారం వనసమారాధనను ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. తన సామాజిక వర్గంతో పాటు రాబోయే ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీలో నా పరిస్థితి.. రెడ్ల స్థితి ఘోరంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి.. గురజాలలో ‘‘మనోడి’’నే గెలిపించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. తాను నరసరావుపేట నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. మన సామాజిక వర్గం నుంచి ఎవరు వచ్చినా సాయం చేస్తానన్నారు.

వైఎస్ కేవలం రెడ్ల గురించి ముఖ్యమంత్రి అవ్వలేదు.. పేదల సంక్షేమం కోసం పనిచేశారంటూ కొనియాడారు. ఈ వ్యాఖ్యలను సభకు హాజరైన వారిలో ఒకరు రికార్డు చేసి వాట్సాప్ చేయడంతో అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వచ్చే ఎన్నికల్లో మన సామాజిక వర్గపు అభ్యర్థి అంటూ (వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి)ని గెలిపించుకోవాల్సిందిగా మోదుగుల వ్యాఖ్యానించడంపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పడంపై వారు భగ్గుమంటున్నారు.

పార్టీలో సభ్యత్వం కూడా లేని మోదుగులకు నరసరావుపేట లోక్‌సభ టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు గెలిపించారని.. 2014లో గుంటూరు పశ్చిమ సీటుకు ఎంతోమంది పోటీ పడినా వారందరినీ కాదని మోదుగులకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారని ఈ సంఘటనలను వేణుగోపాల్ రెడ్డి మరచిపోయి మాట్లాడుతున్నారని వారు విమర్శించారు.

అయితే ఈ సారి తనకు టికెట్ రాదన్న ఆందోళనలో మోదుగుల ఉన్నారని... పార్టీ నిర్వహించిన సర్వేలోనూ వేణుగోపాల్ రెడ్డి చాలా వెనుకబడ్డారని తేలింది. దీంతో పనితీరు మార్చుకోవాలని మోదుగులను స్వయంగా చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారని తెలుస్తోంది. నిన్న మన సామాజిక వర్గపు అభ్యర్థినే గెలిపించుకోవాలని చెప్పడం ద్వారా మోదుగుల వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.