హైదరాబాద్: రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. ఈనెల 30న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మేడా మల్లికార్జునరెడ్డి అతడి సోదరుడు పార్టీలో చేరే అంశంపై వైఎస్ జగన్ తో చర్చించనున్నారు. 

ఈ నేపపథ్యంలో మరికాసేపట్లో మేడా మల్లికార్జునరెడ్డి సోదరులు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్ ను కలవనున్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ వీడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

ఇకపోతే గత ఆరునెలలుగా మేడా మల్లికార్జునరెడ్డి, అతని సోదరుడు వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు మేడా మల్లికార్జునరెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు. మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టంలేదన్నారు. 

కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నేతలు, కార్యకర్తలతో సీఎం తన నివాసంలో సమావేశమయ్యారు. అనర్హుడికి అందలమెక్కించారని, మేడాను సస్పెండ్‌ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ నేతలను మేడా మల్లికార్జునరెడ్డి కలవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. 

అలాగే కార్యకర్తలను మేడా మల్లికార్జునరెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కొందరు నేతలు చంద్రబాబు దగ్గర వాపోయారు. దీంతో ఆగ్రహం చెందిన చంద్రబాబు కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాళ్లకు పార్టీలో స్థానం లేదని తెగేసి చెప్పారు. దీంతో మేడాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చంద్రబాబు సమావేశంలోనే ప్రకటించారు.