ఎస్ఐ, రైటర్ను తన కార్యాలయానికి పిలిపించుకుని ఓ ఎంఎల్ఏ మరీ నిర్భందించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎంఎల్ఏ రాధాకృష్ణ నిర్వాకం రాష్ట్రంలో  కలకలం రేపుతోంది.  

అధికార పార్టీ ఎంఎల్ఏల్లో చాలామందికి కళ్ళు నెత్తికెక్కినట్లే ఉంది. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు ఉదాహరణ. ఎస్ఐ, రైటర్ను తన కార్యాలయానికి పిలిపించుకుని ఓ ఎంఎల్ఏ మరీ నిర్భందించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎంఎల్ఏ రాధాకృష్ణ నిర్వాకం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

ఇటీవల నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఓ చర్చి విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇరు వర్గాలంటే ఒకవైపు టిడిపి ఇంకోవైపు వైసీపీ ఉంటాయికదా. సమాధుల్ని అలికే విషయమై మొదలైన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. వైసీపీ వాళ్ళపైన టిడిపి వాళ్లు దాడి చేసి కొట్టారు. దాంతో దెబ్బలుతిన్న వాళ్ళు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు.

ఇక్కడే సమస్య మొదలైంది. పోలీసులు ఎవరి మీదైతే కేసులు పెట్టారో వాళ్ళంతా ఎంఎల్ఏ మద్దతుదారులు. వెంటనే ఎంఎల్ఏ జోక్యం చేసుకుని ఎస్ఐతో మాట్లాడి తమవారిపై కేసులు ఎత్తేయాలని హుకూం జారీ చేసారు. అయితే, కొద్ది రోజుల తర్వాత పోలీసులు ఇరు వర్గాల్లోని కొందరిని అరెస్టు చేసారు. దాంతో ఆ విషయం మళ్ళీ ఎంఎల్ఏ దగ్గరకు చేరింది.

ఇక్కడే ఎంఎల్ఏకి ప్రిస్టేజ్ వచ్చేసింది. అధికార పార్టీ వాళ్లపైనే కేసులు పెడతారా అంటూ గొడవ మొదలుపెట్టారు. పైగా తాను కేసులు ఎత్తేయమంటే వినకపోగా అరెస్టులు కూడా చేస్తారా అంటూ ఎస్ఐ, రైటర్ ను వెంటనే తన కార్యాలయానికి రావాలంటూ ఆదేశించారు. పాపం, వాళ్ళేం చేస్తారు చెప్పండి. ఆదేశించింది ఎంఎల్ఏ కాబట్టి గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కార్యాలయానికి వెళ్ళారు.

తన కార్యాలయానికి వచ్చిన పోలీసులను చూడగానే ఎంఎల్ఏ బూతుల దండకం మొదలుపెట్టారు. వారిని నేలపై కూర్చోబెట్టి తమ వారిపై కేసులు ఎత్తేసి వదిలి పెట్టేంత వరకూ కార్యాలయం నుండి బయటకు పంపేది లేదంటూ నిర్బంధించారు. దాంతో పోలీసులు బిక్కచచ్చిపోయారు. తమను ఓ ఎంఎల్ఏ నిర్బంధించటమేంటో వారికి అర్ధం కాలేదు.

సరే, విషయం ఎలాగో ఎస్పీకి చేరింది. వెంటనే ఎస్పీ జోక్యం చేసుకుని ఎంఎల్ఏతో మాట్లాడారు. నిర్బంధించిన పోలీసులను ఎంఎల్ఏ విడిచిపెట్టారు. అయితే, అక్కడే ఉన్న అనుచరులు ఊరుకోలేదు. గదిలో నుండి పోలీసులు బయటకు రాకుండా బూతులు తిడుతూ మళ్ళీ అడ్డకున్నారు. విషయం తెలుసుకున్న మిగిలిన పోలీసులు పెద్ద ఎత్తున ఎంఎల్ఏ కార్యాలయానికి చేరుకోవటంతో బ్రతుకుజీవుడా అంటూ నిర్బంధంలో ఉన్న పోలీసులు బయటపడ్డారు.