అధికారుల తీరుతో షాక్ కు గురైన అధికార పార్టీ ఎంఎల్ఏ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాంతో ఎంఎల్ఏ లేకుండానే అధికారిక కార్యక్రమం మొదలైపోయింది. అసలే, ప్రోటోకాల్ సమస్యతో అవమాన పడుతున్న ఎంఎల్ఏకి అధికారులు ఇచ్చిన తాజా షాక్ తో ఫోన్ కు కూడా అందుబాటులో లేకుండా మాయమైపోయారు. ఇంతకీ ఏమి జరిగిందంటే? కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పిల్లి అనంతలక్ష్మి ఎంఎల్ఏగా ఉన్నారు. నియోజకవర్గంలో చాలా కాలంగా అధికారులతో పడటం లేదు.

పడటం లేదంటే మరేం లేదు. ప్రోటోకాల్ వ్యవహారం. ఎంఎల్ఏగా తనకిచ్చే మర్యాదలే తన భర్తకు కూడా ఇవ్వాలన్నది ఎంఎల్ఏ డిమాండ్. అధికార కార్యక్రమాల్లో ఎంఎల్ఏకి మాత్రమే ప్రోటోకాల్ ఉంటుందని, ఎంఎల్ఏ భర్తకుండదని అధికారులు ఎంత చెప్పినా పిల్లి వినటం లేదు. దాంతో ప్రతీ చిన్న విషయానికి ఎంఎల్ఏ-అధికారలు మధ్య వివాదాలు రేగుతున్నాయి.

ఇక, ప్రస్తుతానికి వస్తే కాకినాడ బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే అధికారులు కూడా ఏర్పాట్లు చేసి ఎంఎల్ఏని పిలిచారు. అయితే, ఫెస్టివల్ కు తన భర్తను పిలవకపోవటంతో ఎంఎల్ఏకి కోపం వచ్చింది. దానికి తోడు ఎంఎల్ఏ మద్దతుదారులు కూడా అధికారుల వైఖరిపై ఎంఎల్ఏకి నూరిపోసారు. దాంతో ఎంఎల్ఏ-అధికారుల మధ్య పెద్ద గొడవే జరిగింది. అయినా సరే, అధికార కార్యక్రమాలకు ఎంఎల్ఏ భర్త సత్తిబాబును పిలిచేది లేదని తెగేసి చెప్పారు.

సరే, ఇదే విషయం చివరకు జిల్లా ఉన్నతాధికారులకు కూడా చేరింది. వారు కూడా ప్రోటోకాల్ ప్రాకారమే నడుచుకోవాలని నిర్ణయించారు. దానికితోడు ఫెస్టివల్ కు జారీ చేసే పాస్ ల విషయంలో కూడా ఎంఎల్ఏకు పరిమితి విధించారు. అది ఇంకా అవమానంగా భావించిన ఎంఎల్ఏ, ఫెస్టివల్ ప్రారంభానికి ముందు నుండే అజ్ఞాతంతోకి వెళ్ళిపోయారు. ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు ఎంఎల్ఏ కనబడకపోవటంతో ఆరాతీసారు. జరిగిన విషయం తెలుసుకున్నారు. ఎంఎల్ఏతో మాట్లాడుదామని ప్రయత్నం చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తోంది. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో చేసేది లేక ఎంఎల్ఏ లేకుండానే ఫెస్టివల్ ప్రారంభించేశారు.