టీడీపీ సీనియర్ నేత , ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో వైసీపీ ఖాళీ అవుతుందని బుచ్చయ్య చౌదరి జోస్యం చెప్పారు.
టీడీపీ సీనియర్ నేత , ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో వైసీపీ ఖాళీ అవుతుందని బుచ్చయ్య చౌదరి జోస్యం చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. వ్యవస్థలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనబడుతోందని, చివరికి అంబేద్కర్ విగ్రహావిష్కరణ పేరుతోనూ దోచుకున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు. జగన్ పాలనలో దళితులు, బీసీ, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగాయని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
మరోవైపు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపైనా చౌదరి స్పందించారు. గంటా రాజీనామాపై గత మూడేళ్లుగా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్ధిని నిలబెడితే తాము గెలిపించుకుంటామని, రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే గంటా రాజీనామాను హడావుడిగా ఆమోదించారని బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు.