అమరావతి: భద్రాచలం దేవాలయంపై ఏపీ ప్రజలకు సెంటిమెంట్ ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. భద్రాచలం  దేవాలయం ఆదాయం తెలంగాణది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే చర్చలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.  ఈ సమయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హైద్రాబాద్ రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే సమయంలో  ఆనాడు ఏపీ రాష్ట్రంలో ఉన్న మండలాలను తిరిగి ఏపీలో కలపలేదన్నారు.

భద్రాచలం ఆలయాన్ని భక్త రామదాసు  పిఠాపురం డివిజన్లో‌ వచ్చిన ఆదాయంతో  నిర్మించారని ఆయన గుర్తు చేశారు. భద్రాచలం ఆలయం కూలిపోయే దశలో ఉంటే రాజమండ్రికి చెందిన కొందరు పెద్దలు ఈ ఆలయాన్ని విరాళాలు సేకరించి నిర్మించారని ఆయన గుర్తు చేశారు.

మునగాల పరగణ ఆనాడు కృష్ణా జిల్లాలో ఉండేదన్నారు. పులిచింతల ప్రాజెక్టు కనీసం ఏపీ పరిధిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు సఖ్యతతో ఉన్నాయని చెబుతున్నారు. ఈ అంశాలను కూడ  ఏపీ రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని  బుచ్చయ్య చౌదరి కోరారు.

అయితే ఈ సమయంలో  ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి జోక్యం చేసుకొన్నారు. రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని పోరాటం చేసింది ఒక్క వైసీపీ మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. సమైఖ్యాంద్రపై మొదటి నుండి కట్టుబడి ఉన్న నేత జగన్ అని ఆయన గుర్తు చేశారు. మొన్నటి వరకు అధికారంలోనే ఉన్న భద్రాచలం దేవాలయాన్ని ఏపీ రాష్ట్రంలో కలిపేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని  శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.