రాజమండ్రి: ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రి ప్రజలు అప్రమత్తంగా వుండాలని స్థానిక టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. అతిధులను మంచి ఆతిద్యం ఇస్తారన్న పేరున్న గోదావరి ప్రజలు కరోనాకు మాత్రం ఆతిద్యం ఇవ్వవద్దని... రాజమండ్రిలో కరోనా వ్యాప్తిని నియంత్రించాల్సిన బాధ్యతను ప్రతిఒక్కరు తీసుకోవాలని బుచ్చయ్యచౌదరి సూచించారు.  

''కరోన మొత్తం రాజమండ్రి లో తిష్ట వేసినట్లు ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలు వద్దు. అతిథులకి ఆతిధ్యం గోదావరి జిల్లాలు బాగా ఇస్తాయి అని పేరుంది. కానీ కరోన కి ఇవ్వొద్దు. రాజమండ్రి ని కరోన 'హాట్ స్పాట్' గా కాకుండా 'సేఫ్ స్పాట్' గా మారుద్దాం'' అంటూ ట్వీట్ చేశారు. 

''రాజమండ్రిలో ఏడు ప్రైవేట్ హాస్పిటల్స్  ను కరోనా కేర్ హాస్పిటల్స్ గా మార్చారు. ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలు గుర్తించాలి. దయచేసి ఈ సమాచారాన్ని అవసరమైన వారికి అందించాలి'' అంటూ హాస్పిటల్స్ కు సంబంధించి ప్రభుత్వం విడుదలచేసిన సమాచారాన్ని జతచేస్తూ ట్వీట్ చేశారు. 

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. శనివారం రికార్డు స్థాయిలో కేసులు రికార్డయ్యాయి. 24 గంటల్లోనే ఏపీలో 3,963 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 44609కి చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా ఒక్కరోజే 52 మంది మృత్యువత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 586కు చేరుకుంది.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శించింది. ఈ జిల్లాలో కొత్తగా 994 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం జిల్లాలో 220, చిత్తూరు జిల్లాలో 343, గుంటూరు జిల్లాలో 214, కడపలో 145 కేసులు నమోదయ్యాయి.

కృష్ణా జిల్లాలో 130, కర్నూలు జిల్లాలో 550, నెల్లూరు జిల్లాలో 278, ప్రకాశం జిల్లాలో 266, శ్రీకాకుళం జిల్లాలో 182 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 116, విజయనగరం జిల్లాలో 118 పశ్చిమ గోదావరి జిల్లాలో 407 కేసులు నమోదయ్యాయి. ఈ రకంగా ఏపీలోని స్థానికులు మొత్తం 3963 మందికి కరోనా వైరస్ సోకింది. 

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మరణించారు. అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మరణించారు. చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో గానీ, విదేశాల నుంచి వచ్చినవారిలో గానీ ఏ విధమైన కరోనా కేసులు నమోదు కాలేదు.గోదారోళ్లూ జాగ్రత్త... కరోనాకి ఆతిధ్యమివ్వొద్దు: గోరంట్ల బుచ్చయ్య