అమరావతి: విశాఖపట్నంకు చెందిన ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం దాదాపు ఖరారయ్యింది. అయితే ఆయన ఎప్పుడు చేరతారన్న దానిపైనే రాజకీయ వర్గాల్లోనే కాదు రాష్ట్ర ప్రజల్లో చర్చ సాగుతోంది. ఈ చర్చకు రేపటి(శనివారం)తో ఫుల్ స్టాప్ పడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసిపిలో చేరడానికి రేపే ముహూర్తం ఖరారయినట్లు సమాచారం.

గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన తనయుడు రవితేజ కూడా వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్యేలు, నాయకుల వైసిపిలో చేరే సమయంలో అనుసరిస్తున్న వ్యూహాన్నే గంటా కూడా అనుసరించనున్నాడట. అంటే తన కొడుకుతో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్న మంత్రి గంటా అధికారికంగా మాత్రం కొడుకును మాత్రమే పార్టీలో చేర్చనున్నారు. అంటే గంటా రవితేజ మాత్రమే పార్టీ కండువా కప్పుకుని వైసిపిలో చేరనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆపీసులో ఈ చేరిక కార్యక్రమం జరగనుంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓటమితో ఆ పార్టీ నాయకులు వైసిపిలోకి వలస బాట పట్టారు. టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు సైతం అధికారంలో వున్న వైసిపిలో చేరారు. అయితే ఈ  చేరిక వల్ల తమపై అనర్హత వేటు పడకుండా ఎమ్మెల్యేలె జాగ్రత్త పడ్డారు. తమ తరపున వారసులను వైసిపిలో చేరుస్తున్నారు. వారికే కండువా కప్పించి వైసిపిలోకి పంపుతున్నారు. ఇదే వ్యూహాన్ని గంటా అనుసరించనున్నట్లు తెలుస్తోంది.