విశాఖపట్టణం: విశాఖపట్టణంలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయంలో కేటాయించిన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం సరైంది కాదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చెప్పారు.  ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన సీఎంను కోరారు.

పట్టణంలోని గోపాలపట్నం ఆగనంపూడిలో క్రీడా ప్రాంగణం నిర్మాణానికి టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో స్థలం కేటాయించింది. అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం స్థల కేటాయింపును రద్దు చేసింది. ఈ విషయమై ఎమ్మెల్యే గణబాబు సీఎం జగన్ కు లేఖ రాశాడు. ప్రభుత్వ నిర్ణయం సరైందికాదని ఆయన చెప్పారు. ఓ క్రీడాకారుడిగా ప్రభుత్వ నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని పోటీలకు ఉపయోగపడేలా 150 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం నిర్మించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే 80 ఎకరాలను శాప్ కు అప్పగించినట్టుగా చెప్పారు. మరో 70 ఎకరాలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. క్రీడా ప్రాంగణం రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.