జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై టిడిపి ఎంఎల్ఏ వంగలపూడి అనిత పుల్లుగా ఫైర్ అయ్యారు. పవన్ పోలవరం పర్యటన, చంద్రబాబునాయుడుపై పవన్ చేసిన వ్యాఖ్యలు తదితరాలపై టిడిపి ఆలస్యంగా స్పందించింది. దాదాపు 15 రోజుల క్రితం పవన్ పోలవరం ప్రాజెక్టును పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రాజెక్టు సైట్ నుండి మీడియాతో మాట్లాడుతూ, గడువులోగా పోలవరం నిర్మాణం సాధ్యం కాదని తేల్చేసారు. అంతేకాకుండా పోలవరం నిర్మాణంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. లెక్కల విషయంపై మాట్లాడుతూ, ‘ముందు మన బంగారం మంచిదైతే కదా కేంద్రాన్ని నిలదీయటానికి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

అయితే, అప్పట్లో పవన్ పై టిడిపి నేతలెవరూ స్పందించలేదు. అందుకు కారణం నేతలెవరూ మాట్లాడకుండా చంద్రబాబు కట్టడి చేయటమే. మరి టిడిపిలో ఏమైందో అర్ధం కావటం లేదు. హటాత్తుగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ పవన్ పై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. పవన్ కు విషయం తెలియకుండానే మాట్లాడుతున్నట్లు మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టుపై పవన్ కున్న పరిజ్ఞాన్నానే ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎలా విమర్శిస్తారంటూ కడిగేసారు. ప్రాజెక్టుపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చివరకు పవన్ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరమే లేదని తేల్చేసారు. వనిత అంత ఘాటుగా కాకపోయినా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా  పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పవన్ కు వ్యతిరేకంగా టిడిపిలో ఒక్కొక్కరూ నోరు విప్పుతున్న విషయం గమనార్హం.