Asianet News TeluguAsianet News Telugu

టీడీపీకి షాక్: ఎమ్మెల్యే రాజీనామా

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బతగిలింది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను శాసనసభ కార్యదర్శి విజయ్‌రాజ్‌కు ఆయన అందజేశారు. 

TDP MLA Eeranna resign following SC judgement
Author
Amaravathi, First Published Dec 14, 2018, 5:59 PM IST

అనంతపురం: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బతగిలింది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను శాసనసభ కార్యదర్శి విజయ్‌రాజ్‌కు ఆయన అందజేశారు. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినందున హైకోర్టు ఈరన్నను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 

అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినప్పటికీ ఈరన్నకు అక్కడా ఎదురు దెబ్బ తగిలింది. ఈరన్న ఎమ్మెల్యేగా అనర్హుడని తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాసాగాలని సుప్రీం కోర్టు తెలిపింది. 

అందులో భాగంగా శుక్రవారం తన రాజీనామా లేఖను శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సమర్పించేందుకు శాసనసభకు వచ్చారు. అయితే స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.

ఇకపోతే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఈరన్న దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణలపై వైసీపీ నేత తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన హైకోర్టు నవంబర్ 27న తీర్పు వెలువరించింది. 

శాసనసభ సభ్యుడిగా ఈరన్న ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈరన్నపై వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

ఈరన్న అఫిడవిట్ లో తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్నిపేర్కొనకపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని, కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్‌ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు ఆయన స్థానంలో డాక్టర్‌ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు జారీ చేసింది. 

టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్‌లో పొందుపరచలేదు. 

ఈ వివరాలను 2014 ఎన్నికల సమయంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ తిప్పేస్వామి ఎన్నికల రిటర్నరింగ్‌ అధికారి దృష్టికి తెచ్చారు. అయితే రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు.  ఈ విషయమై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios